బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన కేసులో ముంబై పోలీసులు కీలక మలుపు తిప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని శనివారం (జనవరి 19) థానేలో అరెస్టు చేశారు. నిందితుడి అసలైన పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ అని, అతను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
ప్రధాన నిందితుడిని థానేలోని హీరానందానీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్, థానే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు బంగ్లాదేశీయుడిగా గుర్తింపు పొందిన షరీఫుల్ ఇస్లాం షాజాద్, వయసు 30 సంవత్సరాలు. హౌస్‌కీపింగ్ ఏజెన్సీలో చేరి దొంగతనం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు, కత్తితో సైఫ్‌ను గాయపరిచాడు. సైఫ్ శరీరంలో ఆరు చోట్ల గాయాలు కాగా, శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రధాన నిందితుడిని ఖర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని థానేలోని హీరానందానీ ఎస్టేట్‌లోని టిసిఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలం సమీపంలో ఉన్న లేబర్ క్యాంప్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దాస్ మొదట్లో థానేలోని హీరానందని ప్రాంతంలో పనిచేసేవాడు. కాబట్టి అతడికి ఈ ప్రాంతంపై పూర్తిగా అవగాహన ఉంది. సైఫ్ దాడి చేసిన అనంతరం థానేలోని లేబర్ క్యాపు సమీపంలోని అడవిలో విజయ్ దాస్ దాక్కున్నట్లు సమాచారం. అంతకు ముందు అతడు ముంబైలోని ఓ పబ్‌లో పనిచేసినట్లు విచారణలో తేలింది.
100 మందికి పైగా పోలీసు బృందాలు 72 గంటలపాటు 15 నగరాల్లో గాలించి, నిందితుడిని పట్టుకున్నారు. సైఫ్ ఇంట్లోకి దొంగతనం చేయడానికే ప్రవేశించినట్లు విచారణలో తేలింది. ముంబై పోలీసులు ఈ కేసుపై విలేకరుల సమావేశం నిర్వహించి, విచారణ మరింత లోతుగా కొనసాగుతుందని తెలిపారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. సైఫ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండడంతో అభిమానులు ఊరట చెందుతున్నారు.