2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహాకుంభమేళా సమయంలో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగనుందని అంచనా వేస్తున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పుష్కరాలు జరుగనున్నాయి.
భక్తుల సౌకర్యార్థం కేంద్రం ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. రైల్వే శాఖ మరిన్ని రైళ్లను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.271.43 కోట్ల నిధులు కేటాయించారు. పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు రానున్నారని అంచనా వేస్తున్న అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
గోదావరి నది ఒడ్డున ప్రస్తుతం 17 ఘాట్లకు ఉన్న సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొత్తగా నాలుగు ఘాట్లు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భక్తుల బస కోసం ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల సమీక్షలో ప్రత్యేక ప్రతిపాదనలు సిద్దం చేశాయి.
రాజమహేంద్రవరం పరిధిలో ఘాట్ల అభివృద్ధి కోసం రూ.904 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. రోడ్లు, బ్రిడ్జిల కోసం రూ.678.76 కోట్ల నిధులు కేటాయించనున్నారు. మొత్తం ఘాట్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికపై సీఎం సమీక్ష జరపనున్నారు.