తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న ..రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలను శ్రీకారం చుట్టారు. కాగా ఈ నాలుగు పథకాలు జీహెచ్‌ఎంసీ తప్ప తెలంగాణలో ప్రతి మండలంలోని ప్రతీ గ్రామంలో నేటి నుంచి అంటే జనవరి 27 నుంచి అమలవుతున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు రైతులు, రైతు కూలీలు అకౌంట్లలో జమ కాబోతున్నాయి. మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 606 గ్రామాల్లో రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది.
మొదటి దశలో భాగంగా ఎకరాకు 6 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో డబ్బును ప్రభుత్వం జమ చేస్తుంది. మరోవైపు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12 వేల రూపాయలను అందిస్తుంది . ఈ మొత్తాన్ని కూడా ఈరోజు నుంచి రైతు కూలీల అకౌంట్లలో జమ చేయగా.. మొదటి విడతలో 10 లక్షల మంది లబ్దిదారులకు మేలు జరగనుంది.
జనవరి 26న రిపబ్లిక్ డే పైగా ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో..ఈరోజు నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు భరోసా నిధులు అందుతున్నాయి. సాచురేషన్ పద్ధతిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12 వేల పైచిలుకు గ్రామాల్లో మార్చి 31 లోపు ఈ 4 పథకాలు అమలవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన వారందరికి కూడా మార్చి 31లోగా నాలుగు పథకాలను అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామంటోన్న రేవంత్ సర్కార్, ..పొరపాటున అనర్హులకు పథకాలు అందితే మాత్రం వాటిని నిలిపివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. పేర్లు రాని వారంతా కొత్తగా దరఖాస్తులు సమర్పించాలని.. ఎన్ని వచ్చినా తీసుకుంటామని రేవంత్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మార్చి 31 లోపు అర్హులందరికీ అకౌంట్లలో నగదు జమ అవుతుందని.. ఒకవేళ డబ్బులు పడనివారు స్థానిక అధికారులను సంప్రదించాలని పేర్కొంది.