మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తన “సోర్స్ కోడ్ – మై బిగినింగ్” అనే పుస్తకంలో వెల్లడించారు. ఇందులో చిన్ననాటి అనుభవాలు, టీనేజ్‌లో చేసిన ప్రయత్నాలు, అలాగే అతని వ్యక్తిగత జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నారు.
డ్రగ్స్, గంజాయి వాడకం
బిల్ గేట్స్ తన స్కూల్ డేస్‌లో మారిజ్వానా (గంజాయి) మరియు నిషేధిత ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను కొన్ని సార్లు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలను ఆకర్షించేందుకు ఈ డ్రగ్స్ వాడేవారని, అయితే తన ప్రయత్నాలు విఫలమయ్యాయని స్పష్టం చేశారు. వీటిని వినోదం కోసం మాత్రమే ప్రయత్నించానని, కానీ ఎప్పుడూ దీని బానిసగా మారలేదని పేర్కొన్నారు.
టీచర్ లాంజ్‌లో మద్యం తాగిన అనుభవం
సియాటెల్‌లోని లేక్ సైడ్ స్కూల్‌లో చదివేటప్పుడు, టీచర్ లాంజ్‌లో తొలిసారిగా మద్యం తాగిన అనుభవాన్ని గేట్స్ వివరించారు. తన స్నేహితుడు పాల్ అలెన్ ఒత్తిడి చేయడంతో తొలిసారిగా విస్కీ తాగానని, అయితే అది అతిగా తాగడం వల్ల అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. అప్పటి నుంచి తనకు విస్కీ వాసన కూడా నచ్చదని పేర్కొన్నారు.
పాల్ అలెన్‌తో స్నేహం, మైక్రోసాఫ్ట్ స్థాపన
బిల్ గేట్స్ తన జీవితంలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా పాల్ అలెన్‌ను పేర్కొన్నారు. 1975లో ఇద్దరూ కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారని, ఇద్దరికీ కంప్యూటర్లపై ఉన్న మక్కువ వారిని ఈ ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లిందని వివరించారు.
బాల్యంలో ఆటిజంతో పోరాటం
తాను చిన్నప్పుడు ఆటిజం సమస్యతో బాధపడ్డానని, దానికి సరైన వైద్యం లేకపోవడంతో తన తల్లిదండ్రులు అనేక ఆస్పత్రులకు తిరిగారని గేట్స్ వెల్లడించారు. వారి కృషి వల్లే తన ఆరోగ్యం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని చెప్పారు. తన చిన్ననాటి స్నేహితుడు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని గేట్స్ వెల్లడించారు.
ఈ పుస్తకం ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది. ఇందులో గేట్స్ తన యవ్వనం వరకు జరిగిన అనేక సంఘటనలను వివరించారు. భవిష్యత్తులో వచ్చే మరిన్ని పుస్తకాల ద్వారా తన ఉద్యోగ జీవితం, మైక్రోసాఫ్ట్‌లో ప్రయాణం, మెలిందా గేట్స్‌తో వివాహం, దాతృత్వ కార్యక్రమాల గురించి తెలియజేయనున్నారు.