తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి రాజకీయ వేడి పెంచారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో భేటీ అయిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు నేతలను కేసీఆర్కు పరిచయం చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలన్నీ గంగలో కలిశాయని, రైతులు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని, మళ్లీ కరెంట్ కోతలు, నీళ్ల కొరత తలెత్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పని చేస్తోందని, తెలంగాణ ప్రజలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
“నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా చూస్తున్నా.. కానీ ఇక చర్యల్లోకి దిగాల్సిన సమయం వచ్చింది” అని వ్యాఖ్యానించిన కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు స్తబ్దతకు గురయ్యాయని, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ముందుకు నడిపేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.
ఇదే సందర్భంగా, గతంలో తమ పాలనలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతులకు మేలు చేశామని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోయారని, త్వరలోనే బీఆర్ఎస్ తిరిగి బలంగా రావాలని, ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. కేసీఆర్ చేసిన విమర్శలు, ఆయన పోరాట పిలుపు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుండగా, కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలకు ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి!