వైభవంగా జరుగుతోన్న మహా కుంభమేళాలో ఇప్పటికే కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా వసంత పంచమి రోజు సుమారు 5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. మౌని అమావాస్య నాటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం వసంత పంచమికి ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీనిపై పోలీసులు రూట్‌ప్లాన్ విషయంలో పకడ్బందీగా వ్యవహరించారు.
కాళీ సడక్ నుంచి భక్తులు వచ్చి…త్రివేణి మార్గ్ ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అటు ఎంట్రీ పాయింట్‌తో పాటు ఎగ్జిట్ పాయింట్ వద్ద వీలైనంత వరకూ పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.భక్తులు భారీగా తరలి వచ్చే అకాశముందని ముందే అంచనాలుండటం వల్ల కొన్ని స్ట్రాటెజిక్ పాయింట్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు. ఆయా ప్రాంతాల్లో క్రౌడ్ కంట్రోల్‌కి ఈ సిబ్బంది పూర్తిగా సహకరించింది. ఇక కుంభమేళా ప్రాంగణాల్లో మౌని అమావాస్య ఘటన జరిగిన దగ్గర నుంచి వన్ వే సిస్టమ్‌ని తీసుకొచ్చారు. తొక్కిసలాట జరిగే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ భారీగా బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.
44 ఘాట్స్‌లో వసంత పంచమి రోజున భక్తులు అమృత స్నానాలు ఆచరించారు.అంతేకాదు నదీ స్నానం ఆచరించిన వెంటనే భక్తులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వసంత పంచమికి తరలి వచ్చే భక్తులకోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సారి రంగంలోకి దిగారు. వీధి వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లను ఆక్రమించకుండా .. వాళ్లని వేరే చోటుకు పంపించారు. రెగ్యులర్ పెట్రోలింగ్‌తో పాటు క్రేన్, ఆంబులెన్స్ సర్వీస్‌లను అందుబాటులో ఉంచేలా చేశారు. అంతేకాకుండా లైటింగ్ కూడా అన్ని చోట్లా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలని, జీరో ఎర్రర్ విధానంతో ఏర్పాట్లు చేయించారు.
మరోవైపు ఈనెల 26తో ముగియనున్న మహాకుంభమేళాకు దేశ విదేశాలనుంచి భక్తులు రావడంతో.. రోజురోజుకు రద్దీ పెరుగుతుంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29న ఒక్క రోజులోనే సుమారు 6 కోట్ల మంది స్నానం చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తం కుంభమేళా కాలంలో సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.