ప్రపంచ భద్రతకు పెనుసవాల్.. అణుబాంబును సిద్ధం చేస్తున్న మరో దేశం

Is Irans Nuclear Bomb Ready A Global Concern

అణుబాంబు అనే శబ్దం వినిపిస్తేనే భయానకత కనిపిస్తుంది. ఒకసారి ఇది భూమిపై పడితే అక్కడ జీవం మిగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 13,000 అణుబాంబులు ఉన్నాయి. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్, పాకిస్తాన్, భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఈ జాబితాలో ఉన్న దేశాలు. ఇప్పుడు ఈ దేశాల సరసన మరొక దేశం చేరబోతోంది. మిస్సైళ్ల తయారీలో ప్రఖ్యాతి గాంచిన ఇరాన్, అణుబాంబు తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలోనే టెస్టింగ్‌కు సిద్ధమవుతోందని అంతర్జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అణుబాంబు తయారీకి అవసరమైన శుద్ధి చేసిన యురేనియం ఇప్పటికే ఇరాన్ వద్ద సిద్ధంగా ఉంది. అణుబాంబు తయారీకి 90% శుద్ధి చేసిన 42 కిలోల యురేనియం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన 200 కిలోల యురేనియం ఉంది. ఈ నిల్వలతో ఇంకొన్ని నెలల్లోనే అణుబాంబు సిద్ధం చేయగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్‌లోని ఎడారుల్లో అణుబాంబుల తయారీకి సంబంధించి రహస్య ల్యాబ్‌లు ఉన్నాయి. ఈ ల్యాబ్‌ల గురించి అమెరికా నిఘా వర్గాలు కీలక సమాచారం సేకరించాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, గత నెల రోజులుగా ఈ ల్యాబ్‌లలో అణుబాంబు తయారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరో రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్, అణుబాంబు ద్వారా హస్తక్షేపాన్ని సమతుల్యం చేయాలని చూస్తోంది. గాజా, సిరియా యుద్ధాల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ అణుబాంబు తయారీ ప్రక్రియను ప్రారంభించగానే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు దీన్ని పసిగట్టాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, బైడెన్ ప్రభుత్వ హయాంలోనే ఈ సమాచారం సేకరించబడింది. తాజాగా, ట్రంప్ కార్యవర్గంతో కూడా దీని గురించి చర్చలు జరిగాయి.

ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో సిరియా తిరుగుబాటుదారులు ఇరాన్ అనుబంధ బలగాలను ఎదిరించారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ఇరాన్ ఆయుధ సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత, ఇజ్రాయెల్‌లో నెతన్యాహు బలోపేతం అయ్యారు. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ తన సెంట్రిఫ్యూజ్ వ్యవస్థను మెరుగుపరిచి, బాంబు-గ్రేడ్ యురేనియం ఉత్పత్తిని వేగవంతం చేసింది.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం, ఇరాన్ ప్రస్తుతం 60% శుద్ధి చేసిన యురేనియాన్ని ఉత్పత్తి చేస్తోంది. అయితే, పౌర అవసరాల కోసం ఏ దేశం కూడా ఈ స్థాయిలో యురేనియం శుద్ధి చేయదని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల, ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, తమ అణు స్థావరాలపై దాడులు జరిగితే, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. దీనివల్ల పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరాన్ అణుబాంబు తయారీపై ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అణుబాంబు తయారై అణు పరీక్ష నిర్వహిస్తే, అది అంతర్జాతీయ స్థాయిలో పెనుపరిణామాలను కలిగించే అవకాశముంది. ప్రపంచ శాంతికి ఇది కొత్త సవాల్‌గా మారనుంది.