టాలీవుడ్ డైరెక్టర్, వివాదాస్పద డైరెక్టర్‌గా పేరు బడ్డ రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే శుక్రవారం 8 గంటలపాటు విచారణ ఎదుర్కొన్న వర్మకు.. మరో షాకిచ్చారు పోలీసులు. సీఎం చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో శుక్రవారం విచారణకు వచ్చి ..తిరుగు వెళుతుండగానే పోలీసులు మరో నోటీసులు పంపారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ , నారా లోకేశ్ మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించి వర్మ ఫిబ్రవరి 07 విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్టేషన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్జీవీని పోలీసులు విచారించారు. విచారణలో భాగంగా మొత్తం 50 ప్రశ్నలను పోలీసులు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదని రిప్లై ఇచ్చిన ఆర్జీవీ.. కొన్నిటికి ఆన్సర్ చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం.
వర్మ ఆలోచించుకోవడానికి కావాల్సినంత సమయం పోలీసులు ఇచ్చినా కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసిన పోలీసులు.. మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఇక విచారణ ముగియడంతో రామ్ గోపాల్ వర్మ పోలీసు స్టేషన్ నుంచి బయటకు వెళ్లారు. అయితే ఇంతలోనే ఆర్జీవీకి గుంటూరు పోలీసులు మరో షాక్ ఇచ్చారు.
2019లో రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తమ మనో భావాలను దెబ్బ తీసేవిధంగా ఉన్నాయంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ .. నవంబర్ 29న సీఐడీ కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాడు. దీంతోనే తాజాగా గుంటూరు సీఐ తిరుమలరావు మరోసారి డైరెక్టర్ కు నోటీసులు జారీ చేశారు.
ఏకంగా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసులు అందించడంతో వర్మ షాక్ తిన్నారు.ఈనెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో వర్మ ఈ విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.మొత్తంగా వర్మను పోలీసులు వదల బొమ్మాళీ అంటూ కేసుల మీద కేసులు పెట్టడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతుంది.