అప్పటి వరకు రోహితే కెప్టెన్.. తేల్చి చెప్పిన మాజీ క్రికెటర్..

Team India Gears Up For Champions Trophy Rohit Sharma Responds To Retirement Talks

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమైంది. దుబాయ్‌లో జరగనున్న మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు నెట్స్‌లో బాగా శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేస్తూ తమ ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. 2017లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, పాకిస్తాన్ చేతిలో ఓటమి చెందింది. ఈసారి మాత్రం విజేతగా భారత్‌లో అడుగుపెట్టాలని ముమ్మరంగా శ్రమిస్తోంది.

టీ20 వరల్డ్‌కప్ విజేత రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతోంది. వన్డే వరల్డ్‌కప్ 2023లో ఫైనల్‌కు చేరదీసిన రోహిత్, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ను సైతం జట్టుకు అందించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా తన నేతృత్వంలో గెలవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా అదే జోష్‌ను కొనసాగిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడేందుకు సిద్ధమవుతోంది.

అయితే, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ అంతగా ప్రభావం చూపలేకపోవడంతో, సోషల్ మీడియాలో అతని రిటైర్మెంట్‌పై చర్చ మొదలైంది. సీనియర్ క్రికెటర్లు, కామెంటేటర్లు, ముఖ్యంగా సునీల్ గావస్కర్ వంటి లెజెండ్స్ కూడా రోహిత్ రిటైర్మెంట్‌పై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో స్పందించాడు. రిటైర్మెంట్ తీసుకునే అంశం గురించి తనకే బాగా తెలుసని, ఆ నిర్ణయం ఇతరుల వల్ల తీసుకునే ప్రసక్తే లేదని గట్టిగా ప్రకటించాడు. జట్టుకు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతే తానే తప్పుకుంటానని, 2027 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా ఆడతానంటూ స్పష్టత ఇచ్చాడు.