ఏపీ డిప్యూటీ సీఎం విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ పై విమర్శలు తమకు చేటు తెస్తున్నాయని భావిస్తున్న జగన్..వీలైనంతవరకు ఆయనపై దాడి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ సబ్ జైల్లో తాజాగా రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సుమారు 30 నిమిషాల పాటు వల్లభనేని వంశీతో భేటీ అయిన జగన్.. జైలు నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశంలో కూడా 30 నిమిషాలు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ తీరుపై విరుచుకుపడ్డ జగన్ పొరపాటున కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు. దీంతో పవన్ విషయంలో జగన్ వ్యూహం మారినట్లు స్పష్టం అవుతోంది.
ఎన్నికలకు ముందు జగన్ ఎక్కువగా పవన్ కళ్యాణ్‌నే ఎక్కువ టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు వెనుక లోకేష్ హస్తం ఉందని.. రెడ్ బుక్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు వైతాజాగా సీపీ నేతలు. దీనిపై తాజాగా మాట్లాడిన జగన్..తప్పు చేసిన కూటమి నేతలను, తప్పులను సమర్థిస్తున్న అధికారులను తప్పకుండా బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించినా కూడా పవన్ ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. అప్పట్లో పవన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ.. తరచూ ఆయన వైవాహిక జీవితంపై కూడా మాట్లాడే జగన్. పదేపదే వివాహాల ప్రస్తావన తీసుకొచ్చేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై జగన్ నుంచి వైసీపీ నేతల వరకూ చేసిన వ్యక్తిగత కామెంట్స్ భారీగా ప్రభావం చూపాయని విశ్లేషకులు బహిరంగంగానే చెప్పారు.దీంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.
మరోవైపు పవన్ కళ్యాణ్‌కు ఈ అరెస్టుల విషయంలో సంబంధం లేదని సంకేతాలు ఇస్తే కూటమిలో విభేదాలకు ఛాన్స్ ఉంటుందనేది కూడా జగన్ వ్యూహం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే జగన్ తన ప్రసంగంలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురాలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కూడా చంద్రబాబు, పవన్ మధ్య సమన్వయం కొనసాగుతోంది. వారి మధ్య బంధం ఇలానే కొనసాగితే వైసీపీకి నష్టం తప్పదు. అందుకే చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేస్తున్న జగన్.. పవన్ కళ్యాణ్ ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదని తెలుస్తోంది.