తాజ్ బంజారా హోటల్ సీజ్..

Taj Banjara Hotel Siege

భాగ్యనగరానికి ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు రాకముందు..పార్క్ హయత్, నోవాటెల్, దసపల్లా వంటి హోటళ్లు ఎంట్రీ ఇవ్వకముందు.. హైదరాబాద్ కు స్టేటస్ సింబల్ గా తాజ్ బంజారా మాత్రమే ఉండేది. బంజారాహిల్స్ – జూబ్లీహిల్స్ మధ్యలో ఉండే ఈ హోటల్ .. హైదరాబాద్ నగరానికి వచ్చే గొప్ప గొప్ప అతిథులకు.. పర్యాటకులకు లగ్జరీ విడిది కేంద్రంగా ఉండేది. ప్రపంచ స్థాయి వంటకాలు లభించడంతో పాటు..హాస్పిటాలిటీ కూడా అదే రేంజ్ లో ఉండేది. సెంట్రల్ ఏసీ, బార్, పబ్ వంటి సౌకర్యాలు ఎన్నో అందుబాటులో ఉండేవి.

దీంతో ఈ హోటల్లో విడిది చేయడానికి ప్రపంచ స్థాయి అతిథులు, పర్యాటకులు ఇష్టపడేవారు. సినిమాల్లోనూ తాజ్ బంజారా హోటల్ ను ప్రత్యేకంగా చూపించేవారు. అంతెందుకు ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ..తాజ్ బంజారా హోటల్లో విడిది చేయడాన్ని స్టేటస్ సింబల్ గా పేర్కొనేవారు. అయితే ఇదంతా గతం కానీ ఇప్పుడు తాజ్ బంజారా హోటల్ పరిస్థితి మారిపోయింది. ఈ హోటల్ నిర్వాహకులు ఆస్తి పన్ను కట్టకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసే పరిస్థితికి వచ్చింది.

శుక్రవారం ఉదయం గ్రేటర్ అధికారులు తాజ్ బంజరా హోటల్ కు తాళం వేయడం హాట్ టాపిక్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం.. 1.43 కోట్ల ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు.రెండేళ్ల నుంచి తాజ్ బంజారా హోటల్ నిర్వాహకులు ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో.. ఆస్తి పన్ను చెల్లించాలని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా.. ఇప్పటికీ యాజమాన్యం స్పందించలేదు.దీంతో తాజ్ గ్రూపునకు చెందిన హోటల్.. ఆస్తిపన్ను చెల్లించకపోవడాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీరియస్ గా తీసుకుంది. కానీ ఈ హోటల్ ప్రాపర్టీ జీవీకే గ్రూప్ నకు చెందినదని .. తాజ్ – జీవీకే మధ్య లీజ్ ఒప్పందం కూడా ముగిసిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఏడాదికాలంగా ఈ హోటల్ నడవడం లేదు. పైగా లీజ్ ఒప్పందం ముగియడంతో జీవీకే గ్రూప్ ఈ హోటల్ నిర్వహణ నుంచి నిష్క్రమించినట్టు తెలుస్తోంది.దీని వల్లే ఏడాదికాలంగా హోటల్ మూతపడి ఉందని తెలుస్తోంది. జీవీకే గ్రూప్ తప్పుకోవడంతో అక్కడ సిబ్బంది కూడా వేరే దారులు చూసుకున్నట్టు తెలుస్తోంది. కాగా తాజ్ బంజారా హోటల్ ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో.. తాళం వేసిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి