తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు వెంటనే పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అయితే దీని కోసం ప్రభుత్వ సిబ్బంది ఎవరూ ఇంటికి రాకపోయినా.. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా ఈ సర్వేలో పాల్గొనొచ్చు అని చెప్పారు.
గతంలో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఇంతకు ముందు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కుల గణన సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వే గడువు నేటితో ముగియనుండటంతో.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. కుల గణన సర్వే నేటితో ముగియనుండటంతో ఇంకా సర్వే లో పాల్గొనని వారు, ఎన్యుమరేటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే కులగణన సర్వే లో పాల్గొనాలి కోరారు. తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలనుకున్నవారంతా కుల గణన సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఎక్కడెక్కడ ఇంకా కులగణన సర్వే లో పాల్గొనలేదో వారికి ఈరోజే ఆఖరి తేదీ కాబట్టి..అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సర్వే లో పాల్గొనని వారిని భాగస్వామ్యం చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.
కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నంబర్ 040-211 11111ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాము కుల గణన సర్వేలో పాల్గొనలేదని ఇప్పటి వరకూ ఫోన్ చేసిన వారి ఇంటికి ఎన్యుమరేటర్లే వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరు రాకపోయినా..ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళ్లి కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ లో నమోదు చేసుకునే వారు seeepcsurvey.cgg.gov.in ద్వారా తమ వివరాలను ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు.