తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై చర్చ జరుగుతుండగా, బేగంపేట ఎయిర్‌పోర్టును తిరిగి కమర్షియల్ సేవలకు తెరవనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెంలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2008లో మూసివేసిన బేగంపేట విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
1930లో నిజాం కాలంలో నిర్మితమైన ఈ విమానాశ్రయం, 2008 వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు కీలక కేంద్రంగా ఉన్నది. కానీ శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత, కమర్షియల్ విమాన రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతానికి వీవీఐపీ విమాన ప్రయాణాలకే పరిమితమైన ఈ ఎయిర్‌పోర్టును మళ్లీ డొమెస్టిక్ విమానాలకు అందుబాటులోకి తెస్తే ప్రయాణికులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
బేగంపేట ఎయిర్‌పోర్టు తిరిగి ప్రారంభమైతే, శంషాబాద్ విమానాశ్రయంపై భారం తగ్గించి, హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండటం వల్ల ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, నగరంలోని ట్రాఫిక్ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని అంచనా. అయితే, బేగంపేటలో ట్రాఫిక్ ఇప్పటికే పెరిగిపోయినందున, ఈ విమానాశ్రయం ప్రారంభానికి ముందు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ ప్రయాణించే ఈ ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతాయో వేచి చూడాలి.