మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీనే ఏకైక ప్రతిపక్షం అని, ప్రతిపక్ష హోదా తమకు రాదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మిగతా మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నప్పుడు, ప్రతిపక్ష హోదా తమకు తప్ప మరెవరికీ దక్కదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో టీడీపీకి 23 సీట్లు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చామని గుర్తు చేశారు.
పవన్‌పై వ్యాఖ్యలు
జగన్ తన ప్రసంగంలో పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కార్పొరేటర్‌కు పెద్ద హోదా, ఎమ్మెల్యేకు తక్కువ హోదా అన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా స్పందిస్తూ, చరిత్రలో తొలిసారిగా రిగ్గింగ్‌ను చూసినట్టు పేర్కొన్నారు. అయితే, శ్రీకాకుళం మాస్టర్లు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
బడ్జెట్‌పై విమర్శలు
ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా జగన్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. అన్ని వర్గాలను మోసం చేసేలా బడ్జెట్ ఉందని, అందులో పరనింద, ఆత్మస్తుతి మాత్రమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ. 3,000 భృతి వంటి హామీలు ఏమయ్యాయో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
రైతుల సమస్యలపై ఫైర్
రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని జగన్ ఆరోపించారు. పీఎం కిసాన్ పథకం కాకుండా అదనంగా రూ. 20,000 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతులకు రూ. 10,717 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు.
వైసీపీ మద్దతుదారులకు అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ మద్దతుదారులకు ఎలాంటి పథకాలు అందించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడటాన్ని జగన్ తప్పుబట్టారు. ప్రతి పిల్లాడికి రూ. 30,000 మోసపోతుందన్నారు. తల్లికి వందనం పథకానికి అవసరమైన మొత్తం రూ. 13,112 కోట్లు కాగా, కేవలం రూ. 8,278 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. మహిళలకు సంవత్సరానికి రూ. 18,000 ఇచ్చే హామీ నెరవేరలేదని, కోటి 80 లక్షల మంది మహిళలకు ఒక్క రూపాయి కేటాయించలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పాలన పూర్తిగా తప్పుడు నిర్ణయాలతో నడుస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.