ప్రముఖ నేపథ్య గాయని కల్పన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలో ఉండటంతో హైదరాబాద్‌లోని కేపీహెచ్బీ హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారని సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిద్రమాత్రలను అధికంగా తీసుకోవడంతో ఆమె ఆరోగ్యం విషమించిందని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు గాయకులు ఆసుపత్రికి చేరుకుని కల్పన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయనీ సునీత, గీతా మాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
కల్పన చెన్నైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపినట్లు సమాచారం. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులను సంప్రదించడంతో, వారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఆమె నివాసానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా, అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం పోలీసులు కల్పన భర్తను విచారిస్తున్నారు. ఆమె అనారోగ్యానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆమె, నిద్రమాత్రలు తీసుకునే అలవాటు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఆమె మానసికంగా బలమైన వ్యక్తిత్వం కలిగినవారని, ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేయనున్నారు.