కాస్త టెన్షన్ ఉన్నా.. మూడాఫ్ నుంచి బయటపడాలన్నా చాలామంది కాఫీతోనే చెక్ పెడతారు. మరికొందరు కాఫీతోనే డే ని స్టార్ట్ చేసి కాఫీతోనే ఆ రోజును పూర్తి చేస్తారు. అందులోనూ అరుకు కాఫీ అంటే అస్సలు వదిలిపెట్టరు.. అలాంటి అరుకు కాఫీ ..భారతదేశంలో అరకు కాఫీ టాప్ బ్రాండ్స్ లో ఒకటిగా చేరిపోయింది. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఈ కాఫీ ప్రపంచంలోనే తనదైన ముద్ర వేసుకుని కాఫీ రుచులను అందిస్తుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండించడండం వల్లే దీనికి అంత రుచి వచ్చిందంటారు స్థానికులు.
1960లో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ విశాఖ జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో..ఈ కాఫీ పంటను 10 వేల ఎకరాలలో అభివృద్ధి చేసింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధికి ఒక డిపార్టుమెంట్ ఏర్పాటైంది. తర్వాత ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగించగా.. అక్కడ గిరిజన ప్రాంతాల్లో సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం మొదలయ్యింది. ఇప్పుడు అరుకు కాఫీగా బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
అలాంటి అరుకు కాఫీకి..పార్లమెంట్లో ప్రత్యేక స్థానం కల్పించేందుకు అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో..ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, స్పీకర్ ఓం బిర్లాను కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్లు కూడా గుర్తు చేశారు.
ఇటీవల సీఎం చంద్రబాబు కూడా పదేపదే అరుకు కాఫీ రుచులను గుర్తు చేసుకుంటున్నారు. అరుకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడానికి అంతా కృషి చేయాలని కోరుతున్నారు. దీనిలో భాగంగానే రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేష్ స్పీకర్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో లోకల్ బ్రాండ్ కు ఇంటర్నేషనల్ ఇమేజ్‌ను తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తే అది తప్పకుండా కూటమి ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే గుర్తింపును తీసుకువస్తుందనడంలో సందేహం లేదన్నది విశ్లేషకుల మాట.
అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు.. ఏపీకి చెందిన అరకు కాఫీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి లోక్ సభ స్పీకరును రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేష్ అనుమతిని కోరారు. ఈ సందర్భంగా..పర్మినెంట్ స్టాల్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అనుకూల అంశంగా మారింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఘుమఘుమలు అందిస్తున్న అరుకు కాఫీ ఇక పార్లమెంట్‌లో పర్మినెంట్ ప్లేసుకు వెళ్లడం కామన్ అని ఏపీ వాసులు ఫిక్స్ అయిపోయారు.