త్వరలోనే తెలంగాణ ప్రజలకుమరో గుడ్ న్యూస్ వినిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది . అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. మొదటి దశలో వరంగల్‌కు ఎయిర్ పోర్టు తీసుకొచ్చానని.. రెండో దశలో ఆదిలాబాద్‌కు విమానాశ్రయాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు.
దీంతో తెలంగాణలో మరో కొత్త ఎయిర్ పోర్టు రాబోతోందని తెలంగాణ వాసులు సంబరపడుతున్నారు. తెలంగాణలో గతంలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు సాగించినా.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక.. అది దాదాపు మూత పడినట్లే అవగా దానిని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా వరంగల్‌లో మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..రేవంత్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించింది.
మార్చి 15న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేకు సమాధానం ఇస్తూ సీఎం ..ఆదిలాబాద్‌కు కూడా విమానాశ్రయాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై తాము కృషి చేస్తున్నామని.. తీసుకొచ్చే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. మొదటి దశలో కేంద్రంతో మాట్లాడి వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చామని.. రెండో దశలో ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్టు తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే సూచించిన వివరాలను తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణం అనేది.. కేవలం ఆ జిల్లా డెవలప్మెంట్ కోసమే కాకుండా.. తెలంగాణ ప్రగతికి కూడా దోహదం చేయనుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతామని.. ఆదిలాబాద్ విమానాశ్రయానికి తమ నుంచి అన్ని సహాయసహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు కూడా ముందుకొచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్టు కోసం సహకరిస్తే.. తెలంగాణలో అభివృద్ధిలో మరో గొప్ప అడుగు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.