అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మల్లన్న, ఇతర బీసీ నేతలతో కలిసి కేటీఆర్‌కు మెమొరాండం అందజేశారు.
కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ – మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు
ఇటీవల, కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కులగణనపై వ్యతిరేకంగా మాట్లాడటం, తన యూట్యూబ్ ఛానెల్ లైవ్ షోలో బీసీ కులగణన సర్వే పత్రాలను తగులబెట్టడం వంటి చర్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయంపై మల్లన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. బీసీలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు న్యాయం చేయడం లేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నేతలతో భేటీపై ఊహాగానాలు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన తీన్మార్ మల్లన్న, అప్పట్లో కేసీఆర్, కేటీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లారు. కానీ ఇప్పుడు, అదే పార్టీకి చెందిన కేటీఆర్‌తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారితీసింది.
బీఆర్ఎస్‌లోకి మల్లన్న? లేక బీసీల కోసం మాత్రమే భేటీ?
సోషల్ మీడియాలో ఈ భేటీపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మల్లన్న త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరతారని కొందరు అంటుండగా, ఆయన అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. బీసీల హక్కుల కోసం మాత్రమే కేటీఆర్‌ను కలిసినట్లు వారు స్పష్టం చేస్తున్నారు. మల్లన్న భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ఏ విధంగా సాగుతుందో చూడాలి!