
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగా మండిపోతున్నాడు. ఏప్రిల్ , మే నెలలో కనిపించాల్సిన ఎండల ప్రభావం మార్చిలోనే కనిపించి మాడు పగలకొడుతుంది. దీనికి తోడు వడగాడ్పులు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే ఎండ మండిపోతుంది. ఇప్పటికే అన్ని చోట్లా టెంపరేచర్లు 42 డిగ్రీల మార్క్‌ను దాటేశాయి. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది.
42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రెండు రాష్ట్రాల్లోని జనాలు అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడి, మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవారంతా ఎండ,వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.. మధ్యాహ్నం వేళ అసవరమైతేనే తప్ప ఎవరూ బయటకు రావొద్దని.. వడ దెబ్బకు గురికాకుండా ఉండటానికి జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
కాగా ఈ రోజు అంటే మార్చి 18న ఏపీలో 128 మండలాల్లో వడగాలులు, 29 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి రెండో వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అధిక ఉష్టోగ్రతలతో పాటు.. వడగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు.
నిన్న తెలంగాణలోని 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.కానీ వాస్తవ పరిస్థితి చూస్తూ ఇంకో 2,3 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది అధిక ఉష్టోగ్రతలతో రికార్డ్ బ్రేక్ చేయనుండటంతో ప్రజలంతా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు కూడా చెబుతున్నారు.