కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలపై హైడ్రా కమిషనర్ క్లారిటీ..

కొద్ది నెలలుగా హైడ్రా పేరు హైదరాబాద్‌లో మారుమోగుతోంది. మొదటలో హైడ్రా దూకుడిపై ప్రశంసలు కురిపించిన వారే తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలపైనే హైడ్రా తమ ప్రతాపం చూపిస్తుందని.. డబ్బున్నవాళ్ల జోలికి పోవడం లేదని విమర్శలు కరిపించసాగారు. ఏది ఏమయినా హైడ్రా మాత్రం అదే దూకుడుతో ముందుకువెళుతోంది. తాజాగా హైడ్రాపై ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపించడం సంచలనంగా మారింది. కాగా దీనిపై హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపణలపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ..హైడ్రా ఎక్కడైనా సరే లావాదేవీలు జరిపినట్లు ఆధారాలుంటే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కోరారు. తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ చెప్పిన రంగనాథ్..ప్రత్యక్షంగానీ ప‌రోక్షంగా కానీ హైడ్రా పేరును వాడుకుని ఎవరైనా సరే వసూళ్లకు పాల్పడితే వారిపైన కూడా తాము క‌ఠిన శిక్ష పడేలా చేస్తామని రంగనాథ్ తెలిపారు.

తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ​ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవరని ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీరాం బిల్డర్స్‌పై తాను ఫిర్యాదు చేసినా కూడా హైడ్రా అధికారులు పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే అయిన తననే పట్టించుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటంటూ అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ కామెంట్లు చర్చనీయాంశం కాగా.. అనిరుధ్‌ కామెంట్స్‌పై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వంశీరాం బిల్డర్స్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఫోన్ కాల్‎కు రెస్పాండ్ కాకపోయినా.. ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి ఉంటే వాట్సాప్ మేసేజ్ చేసినా కూడా తాను స్పందిస్తామని చెప్పారు.

అలాగే.. ప్రజాప్రతినిధులు చేసే ఫిర్యాదులకు తాము ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని రంగనాథ్ అన్నారు. హైడ్రా లావాదేవీలు చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే దానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే.. పోలీసులు, విజిలెన్స్ , ఏసీబీ దృష్టికి తీసుకెళ్లవచ్చని రిప్లై ఇచ్చారు. హైడ్రాకు కంప్లైంట్ వస్తే.. దశాబ్దాల సమస్యలకు కూడా కాస్త ఆలస్యంగా అయినా కూడా తప్పకుండా పరిష్కారం లభిస్తుందని చెప్పుకొచ్చారు.