ఏపీ లిక్కర్ స్కాం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎప్పుడయితే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు లోక్ సభ సాక్షిగా ఏపీ లిక్కర్ స్కామ్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా పెద్దదంటూ వ్యాఖ్యలు చేశారో అప్పుడే అందిరి చూపూ ఏపీవైపు పడింది. దీంతో కూటమి ప్రభుత్వం జాతీయస్థాయిలో వైసీపీ హయాంలో జరిగిన ఈ స్కాంను బయట పెడుతోందా? జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
లోక్ సభలో టీడీపీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని ..ఈమధ్య స్కాం ద్వారా వచ్చిన ధనాన్ని హవాలా రూపంలో విదేశాలకు చేర్చారంటూ కామెంట్లు చేశారు మిగతా రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కాం కంటే కూడా ఏపీలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. సీబీఐతోపాటు ఈడీ ఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా మద్యం పాలసీని ప్రవేశపెట్టి..అప్పటివరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేశాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడుపుతూ..ఆ ఐదేళ్లూ నాసిరకం మద్యం సరఫరా చేయడంతో సర్వత్రా విమర్శలు వినిపించినా ఏమాత్రం జగన్ వెనక్కి తగ్గలేదు. మిగతా ప్రాంతాల్లో కనిపించే ప్రీమియం మద్యం బ్రాండ్లు ఏవీ కూడా ఏపీలో కనిపించలేదు.
దీంతో అప్పటి వరకు ఉన్న డిష్టలరీలను బెదిరించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తమ స్వాధీనం చేసుకున్నారన్న విమర్శలు గట్టిగా వినిపించాయి. మద్యం తయారీదారులు వైసీపీ వారే.. సరఫరాదారులు కూడా వైసీపీ వారే.. చివరకు మద్యం విక్రయించింది కూడా వైసీపీ వారి మనుషులే. అందుకే ఆ సమయంలో 32 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వ ఆరోపిస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కేసులు నమోదవడంతో పాటు.. అరెస్టుల పర్వం కూడా కొనసాగింది.
ఈ లిక్కర్ స్కాంలో ముఖ్యంగా అప్పటి బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డిపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు. అప్పటి మద్యం విక్రయాల్లో జరిగిన అవకతవకల విషయంలో ఏపీ సీఐడీ ఆధారాలను సేకరించింది . పూర్తిస్థాయి ఆధారాలు లభించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించింది. ఎంపీ మిధున్ రెడ్డిపై డిస్టలరీలను బెదిరించి స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు రావడంతో.. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగింది. కానీ తాను అరెస్టు కాకుండా ముందస్తుగా బెయిల్ కూడా తెచ్చుకున్నారు.
కాగా అప్పటి బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో జగన్ చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కామ్లలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా అరెస్టయ్యి.. కొద్దిరోజులు జైలు శిక్షను అనుభవించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇదే జరగనుందని ..అందుకే లోక్సభ వేదికగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ సంచలన ఆరోపణలు చేశారన్న వాదన వినిపిస్తోంది. సీబీఐతో పాటు ఈడీ ఎంట్రీ కావాలని ఆయన కోరడంతో..మున్ముందు ఏపీ లిక్కర్ స్కాం విషయంలో సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.