హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2017లో చోటుచేసుకున్న ఈ ఘటనలో అదనపు కట్నం కోసం భర్త మరియు అత్తవారి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన పెద్ద సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో అన్ని అవసరమైన సాక్ష్యాధారాలను సమర్పించిన పోలీసుల ప్రయత్నం ఫలించింది. శుక్రవారం (మార్చి 28) రంగారెడ్డి కోర్టు తుది తీర్పును ప్రకటించింది. విచారణలో భర్త ఆనంద్, అతని తల్లి భారతమ్మను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు కఠిన శిక్షలను విధించింది.
కోర్టు తీర్పు ప్రకారం, బాధితురాలి ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త ఆనంద్‌కు జీవితఖైదు విధించబడింది. అదనపు కట్నం కోసం వేధించిన అత్త భారతమ్మకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు ఆనంద్‌ను ప్రధాన నిందితుడిగా (A1), అతని తల్లి భారతమ్మను రెండో నిందితురాలిగా (A2) చేర్చి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసుకు సంబంధించిన విచారణలో అనేక మంది సాక్షులను ప్రశ్నించిన అనంతరం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అయితే, కోర్టు తీర్పుపై నిందితుల తరఫున హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు వారి న్యాయవాది తెలిపారు.