హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) భూ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ ప్రాంతంలో భూమిని పరిరక్షించాలనే ఉద్దేశంతో విద్యార్థి సంఘాలు, ఫ్యాకల్టీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తుండగా, పోలీసులు లాఠీచార్జ్ చేపట్టారు, దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. భూమిని అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పగించకూడదని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం ఉదయం నుంచే యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, బాహ్య వ్యక్తులను లోపలికి అనుమతించకుండా, విద్యార్థులను బయటకు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల నిరసనతో యూనివర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తతతో మారిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అణిచివేత ధోరణిని ఖండిస్తూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడం అన్యాయమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ భూ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగించాలని ప్రతిపాదించింది. అయితే, ఇది అటవీ భూమి అని, అక్కడ అనేక చెట్లు, పక్షులు, జంతువులు ఉన్నాయని విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణవాదులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే రేణు దేశాయ్, రష్మీ గౌతమ్, నాగ్ అశ్విన్ వంటి ప్రముఖులు HCU భూమి రక్షణపై మద్దతు ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తన సోషల్ మీడియాలో దీనిపై స్పందించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో HCU వివాదానికి సంబంధించిన ఓ పోస్ట్ షేర్ చేసి, “ఇది నిజంగా జరిగితే అక్కడి పక్షులు, జంతువులు ఎక్కడికి తరలిస్తారు? అక్కడి చెట్లను మళ్ళీ ఎక్కడ నాటుతారు? ఆ ప్లాన్ అందరికి చెప్పండి” అంటూ ప్రశ్నించింది. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది. మరింతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యార్థుల పోరాటం కొనసాగుతుండగా, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
LathiCharge on Students of University of Hyderabad who have protesting to stop cutting down the 400 acres Trees in the campus pic.twitter.com/1iQC52779t
— Dr.Krishank (@Krishank_BRS) April 2, 2025