నల్లగొండ పురోభివృద్ధి చెందాలి, ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనకాడబోదు – సీఎం కేసీఆర్

CM directs officials to focus on development of Nalgonda, CM KCR, CM KCR assures Rs 100 cr for Nalgonda development, CM KCR assures Rs 100 cr for Nalgonda’s progress, CM KCR held High Level Review on Developing Infrastructure Facilities, CM KCR held High Level Review on Developing Infrastructure Facilities in Nalgonda Municipality, CM KCR secures Rs 100 cr for Nalgonda’s progress, Developing Nalgonda Municipality on modern lines, Mango News, Nalgonda Municipality

రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని, నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయిస్తుందని, ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని, కలెక్టర్ సహా ఉన్నత అధికారులను సీఎం ఆదేశించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ పరిశీలించాలని, అందుకు పాదయాత్ర చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు.

నల్లగొండ మున్సిపాలిటీ లో మౌలిక వసతులు మెరుగుపరచడం, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సీఎం కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో కూడిన సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ అభివృద్ది కోసం పట్టణంలో పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. పాదయాత్రలు చేపట్టి అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే మున్సిపల్ కమిషనర్ ను వెంటనే నియమించాలనీ సీఎం అన్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా సీఎం ఫోన్లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ధి చేసే దాకా నిద్రపోవద్దని, సిద్దిపేటను తీర్చిదిద్దినట్లుగా నల్లగొండనూ తీర్చిదిద్దాలని అన్నారు.

ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో మురుగునీటి అండర్ డ్రైనేజీ కాల్వలు, ఆటల కోసం స్టేడియం, పట్టణ వాసులు కోసం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, రైతు బజార్లు, దవాఖానాలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఎలా వున్నాయి అంటూ సంబంధిత అధికారులను సీఎం ఆరా తీశారు. నల్లగొండలో స్ట్రీట్ లైట్ల పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. నల్లగొండలో విద్యుత్ పరిస్తితిని మెరుగు పరిచేందుకు వెంటనే కావాల్సినన్ని సబ్ స్టేషన్లు నిర్మించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పట్టణంలో అనువైన స్థలాలను ఎంపిక చేసుకొని, వాటిలో వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని, రైతు బజార్లు నిర్మించాలన్నారు. ఉదయసముద్రం అద్భుతమైన నీటి వసతితో కళకళలాడుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ ను సుందరీకరించాలని చెప్పారు. నల్లగొండ వాసులకు ఆహ్లాదకరమైనరీతిలో అర్బన్ పార్కును అందుబాటులోకి తేవాలని అన్నారు. సభలు, సమావేశాల కోసం అధునాతన సౌకర్యాలతో రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన టౌన్ హాల్ నిర్మించాలన్నారు. ఇందుకోసం నగరం నడబొడ్డున అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫుట్ పాత్ లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ఉప్పల్ భగాయత్ మాదిరిగా లాండ్ పూలింగ్ చేపట్టి, కాలనీల నిర్మాణానికి పూనుకోవాలన్నారు. గతంలో నల్లగొండ పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేదని, మిషన్ భగీరథ పథకంతో ఆ సమస్య తీరిపోయిందని అధికారులు సీఎంకు వివరించారు. నల్లగొండలో డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిపై సీఎం ఆరా తీశారు. నల్లగొండలో వైకుంఠధామాల పరిస్థితిపై ఆరా తీసిన సీఎం హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు వేర్వేరుగా శ్మశాన వాటికల నిర్మాణాన్ని ప్రత్యేకంగా చేపట్టాలన్నారు.

ప్రాజెక్టు కాలనీల వాసులకు ఇళ్ల పట్టాలు:

ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి, దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇంటి క్వార్టర్లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అక్కడే నివాసం ఏర్పరచుకున్న కాలనీవాసులతోపాటు, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలు ఉన్నాయని, అక్కడ కూడ అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారికి శాశ్వత పట్టాలు కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఫోన్లో ఆదేశించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొని ఇక్కడే నివాసం ఉంటున్న కాలనీ వాసులకు పట్టాలిస్తామని గతంలో మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. “మాట ఇచ్చినపుడు ఆ మాట నిలబెట్టుకోవడం ధర్మమని, మనది ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని” ప్రజా ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. ఇపుడు ఎన్నికల కోడ్ కూడా తొలగిపోయినందున అర్హులైన సాగర్ కాలనీవాసులకు, నియమ నిబంధనలను అనుసరించి, కొంత వెసులుబాటును కల్పించి అయినా సరే, పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘దశాబ్దాల క్రితం ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా పేద కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే అధికంగా పాల్గొన్నారు, వారు ఇక్కడే నివాసమున్నారు, అలాంటిదే ఇక్కడ కూడా నాగార్జున సాగర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. వారంతా తక్కువ స్థలాల్లోనే ఇండ్లు కట్టుకున్నారు, వారందరికీ పట్టాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది.’’ అని సీఎం అన్నారు.

టౌన్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన:

ఈ సమీక్ష సమావేశం అనంతరం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో వున్న ఇరిగేషన్, ఆర్ అండ్ బీ కార్యాలయాలను సీఎం సందర్శించారు. నల్లగొండ టౌన్ హాల్ నిర్మాణానికి నగరం నడిబొడ్డున వున్నందున, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల కార్యాలయాల ప్రాంగణం టౌన్ హాల్ నిర్మాణానికి అనువుగా వుంటుందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సీఎం స్వయంగా పరిశీలించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, రవీంద్ర నాయక్, భాస్కర్ రావు, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 20 =