పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. తర్వాత రూ.2000 నోట్లు,రూ.500 నోట్లు, రూ.200 నోట్లు ముద్రించినా.. తర్వాత రూ.2 వేల నోట్లును మళ్లీ రద్దు చేశారు. అయితే తాజాగా మరోసారి రూ.500, రూ.10 నోట్లకు సంబంధించిన కీలక సమాచారం ఆర్బీఐ వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌లో రూ. 10, రూ. 500 నోట్లను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ కొత్త నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ కొత్త నోట్లు ఇప్పుడు అమలులో ఉంటున్న మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల డిజైన్‌ను పోలి ఉంటాయి అయితే గవర్నర్ సంతకంతో కొత్తగా అప్‌డేట్‌గా విడుదల కానున్నాయి.
10 నోటు చాక్లెట్ బ్రౌన్ రంగులో ఉంటుంది. వెనుక భాగంలో ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం చిత్రం ఉండగా.. ఈ నోటు పరిమాణం 63 మి.మీ x 123 మి.మీ ఉంటుంది. అలాగే రూ. 500 నోటు స్టోన్ గ్రే రంగులో ఉంటుంది. వెనుక భాగంలో భారతీయ వారసత్వ స్థలమైన రెడ్ ఫోర్ట్ చిత్రం ఉండగా.. దీని పరిమాణం 66 మి.మీ x 150 మి.మీటర్లుగా ఉంటుంది. రెండు నోట్లలోనూ మహాత్మా గాంధీచిత్రం, అశోక స్తంభ చిహ్నం, స్వచ్ఛ భారత్ లోగో వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంతేకాదు దష్టి లోపం ఉన్నవారి సౌలభ్యం కోసం బ్రెయిలీ ఫీచర్ కూడా ఈ నోట్లలో ఉంటుంది.
ఆర్‌బీఐ చెబుతున్న దాని ప్రకారం, గతంలో విడుదలైన రూ. 10,రూ. 500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవిగానే కొనసాగుతాయి. కొత్త నోట్ల విడుదలతో పాత నోట్లు చెల్లుబాటు కాకుండా పోవు కాకపోతే..ఈ కొత్త నోట్లు కేవలం గవర్నర్ సంతకంతో తాజా వెర్షన్‌గా విడుదల చేసినట్లు అవుతుంది. ఈ కొత్త నోట్లు అతి త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా, ప్రస్తుత నోట్లతో పాటు కొత్త నోట్లు చలామణీలో ఉంటాయి.
అయితే ఇప్పుడు కొత్త నోట్ల ముద్రణ ఎందుకు అని చాలామంది అనుకోవచ్చు. సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 2024లో బాధ్యతలను స్వీకరించారు. ఆయన సంతకంతో నోట్లను విడుదల చేయడం ఒక సాంప్రదాయక అప్‌డేట్‌గా ఆర్బీఐ భావిస్తోంది. దీంతో పాటు కరెన్సీ సర్క్యులేషన్‌లో వైవిధ్యతను కొనసాగించడంతో పాటు నకిలీ నోట్ల సమస్యను అరికట్టడం కోసం కొత్త డిజైన్ , సంతకం అప్‌డేట్ చేయడం ఆర్బీఐ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది.