దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈమేరకు ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసి..నివేదికను కూడా ఆమోదించింది. అయితే ఎప్పటి నుంచి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
దేశవ్యాప్తంగా ఒకేవిడతలో ఎన్నికలు నిర్వహిస్తే అది ఆర్థికంగా దేశానికి కలిసి వస్తుందని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై గతంలో చాలాసార్లు చర్చలు జరిగినా అవన్నీ అర్ధాంతరంగానే ఆగిపోయాయి. అయితే తాజాగా మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక అడుగు వేసింది. కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకుని ఆమోదాన్ని కూడా పొందింది. కానీ జమిలి ఎన్నికలు ఎప్పటి నుంచి అనేదానిపైన మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
తాజాగా ఇదే అంశంపై చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు గురించి మాట్లాడిన ఆమె.. ఈ విధానాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 2034 తర్వాతే దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో సుమారు లక్ష కోట్లు రూపాయలు ఖర్చయ్యాయని చెప్పిన నిర్మలా సీతారామన్.. జమిలి ఎన్నికలతో ఈ భారీ వ్యయాన్ని ఆదా చేయవచ్చని వివరించారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే .. దేశ జీడీపీలో 1.5% వరకూ పెరుగుదల సాధ్యమని, దీనివల్ల రూ.4.5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లాభం చేకూరుతుందని నిర్మలమ్మ లెక్కలు చూపారు.
అయితే ఈ విధానంపై కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ. అసత్య ప్రచారం చేస్తూ వ్యతిరేకిస్తున్నాయని ఆమె విమర్శించారు. జమిలి ఎన్నికల ఆలోచన అనేది అసలు కొత్తది కాదని, 1960 నుంచి ఈ చర్చ ఉనికిలో ఉందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. దివంగత డీఎంకే నేత కరుణానిధి దీనికి మద్దతిచ్చినా కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. కాగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను చాలామంది ఆర్థిక వేత్తలు కూడా సమర్థిస్తున్నారు.