అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, కఠిన చర్యలతో.. ఇప్పటికే అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతుండగా.. కొత్తవారు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో అక్కడి తెలుగు విద్యార్థులపై మరో బాంబు పడి వారి డాలర్ డ్రీమ్ చెదిరిపోయే పరిస్థితులు వచ్చాయి. ఈ రెండేళ్లలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను కారణాలుగా చూపిస్తూ వీసాలు రద్దు చేసి.. అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశిస్తోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా బహిష్కరణ చేస్తామని హెచ్చరిస్తోంది.
నార్త్ ఈస్ట్రన్, హ్యాంప్‌షైర్, విస్కాన్సిన్ మాడిసన్ వంటి యూనివర్శిటీల్లో చదువుతున్న చాలా మంది స్టూడెంట్స్‌కు ఇలాంటి నోటీసులు అందాయి. వీరిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక్క నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు జారీ కాగా, వీరిలో ప్రస్తుతం చదువుతున్నవారు 18 మంది, చదువు పూర్తి చేసినవారు 22 మంది ఉన్నారు.
వీసా రద్దుతో స్టూడెంట్ అండ్ ఎక్స్‌ఛేంజ్ విజిటర్ ప్రోగ్రాం రికార్డులు కూడా అందుబాటులో ఉండవని యూనివర్శిటీల నుంచి ఈ–మెయిల్స్ వస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమయంలో పడ్డారు. గత నెలలో హమాస్ అనుకూల ఆందోళనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో కొంతమందిని అమెరికా బహిష్కరించారు.
తాజాగా చిన్నచిన్న తప్పిదాలను నేరాలుగా చెబుతూ వీసాను రద్దు చేస్తుంది ట్రంప్ సర్కార్. అధిక వేగంతో వాహనం నడిపిన విద్యార్థులకు ఇప్పటికే వీసా రద్దు చేస్తూ నోటీసులు జారీ అయ్యాయి. సాధారణంగా ఇలాంటి కేసులు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు చాలా కేసులను కొట్టేస్తారు. కానీ కోర్టు విచారణలో ఉన్నవారికి కూడా వీసా రద్దు నోటీసులు అందుతున్నాయి. వీసా రద్దైన వారు అమెరికాలో అక్రమంగా ఉన్నట్లుగా లెక్క. గతంలో ఇలాంటి చిన్న తప్పిదాలు జరిగినా కూడా ఎడ్యుకేషన్, ఓపీటీ, లేదా హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉండటానికి ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు ఏకంగా స్టేటస్ రద్దు చేస్తూ అమెరికా వీడాలని ఆదేశిస్తూ అక్కడి అధికారులు ఈ–మెయిల్స్ పంపిస్తున్నారు.
అంతేకాదు విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపైన కూడా అమెరికా ప్రభుత్వం నిఘా వేస్తోంది. అమెరికా ప్రభుత్వ విధానాలకు, అక్కడి సంస్కతికి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ చేసినా చివరకు స్నేహితులు లేదా ఇతరుల పోస్టులను లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఎఫ్1, ఎం1, జే1 వీసా కేటగిరీల వారిని అమెరికా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది.అధిక వేగంతో వాహనాలను నడపడం,ట్రాఫిక్ నిబంధనల ుఉల్లంఘించడం, చిన్న వయసు వారికి సిగరెట్, మద్యం విక్రయించడం వంటివాటితో పాటు.. షాప్‌లిఫ్టింగ్ అంటే దుకాణాల్లో పూర్తి బిల్లు చెల్లించకుండా వస్తువులు తీసుకోవడం,గృహ హింస కేసులు, మాదకద్రవ్యాల వినియోగం వంటి కారణాలతో నోటీసులు పంపిస్తున్నారు. అయితే ఇలా వీసా రద్దు నోటీసులు అందుకున్న విద్యార్థులు వెంటనే ఇమ్మిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. వారు అమెరికా చట్టాలకు అనుగుణంగా సలహాలను అందిస్తారు. అలాగే, అమెరికాలోని తెలుగు సంఘాలను సంప్రదిస్తే సహాయం పొందే అవకాశం ఉంటుంది.