ట్రంప్ విధించిన సుంకాలు భారత్‌కు సంక్షోభమా, వరమా?

President Donald Trump signs an Executive Order on the Administration’s tariff plans at a “Make America Wealthy Again” event, Wednesday, April 2, 2025, in the White House Rose Garden. (Official White House Photo by Daniel Torok)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో కొత్త అలజడిని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు. చైనాతో సహా వివిధ దేశాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచి ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు భారీ కుదుపునకు గురయ్యాయి. దీంతో తాత్కాలికంగా తన నిర్ణయంపై 90 రోజుల ‘స్టే’ విధించుకున్న ట్రంప్ సర్కార్.. చైనాపై మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

అయితే ప్రపంచం అంతా ట్రంప్ ధోరణితో విలవిల్లాడుతుంటే..భారత్ మాత్రం సంక్షోభాల నుంచి సరికొత్త అవకాశాలను సృష్టించుకుని పైకి ఎదగాలనుకుంటోంది. ఎందుకంటే ఇదేం భారత్‌కు కొత్త కాదు. కోవిడ్-19 సంక్షోభంలో..భారత్ సర్జికల్ మాస్కులు, గ్లౌజులు సహా అనేక మెడికల్ పరికరాల కోసం దిగుమతులపైనే ఆధారపడినా.. అతికొద్ది కాలంలోనే భారత్ స్వయం సమృద్ధిని సాధించి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత యావత్ ప్రపంచానికి కోవిడ్-19 వ్యాక్సిన్లను కూడా అందజేసింది.

ఆ తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధం రూపంలో మరో సంక్షోభం తలెత్తగా ప్రపంచం రెండుగా చీలిపోయి.. అయితే ఆ వర్గం లేదంటే ఈ వర్గం అన్నట్టుగా మిగతా దేశాలన్నీ వ్యవహరించాయి.కానీ భారత్ మాత్రం ధైర్యంగా తటస్థ వైఖరిని అవలంబించింది. అంతేకాదు.. రష్యా చమురును అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి భారత్ తన అవసరాలు తీర్చుకుంది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాల రూపంలో మరో సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం 90రోజులు సుంకాలకు బ్రేక్ వేసినా..తర్వాత ఈ సంక్షోభాన్ని భారత్ ఎలా ఎదుర్కోబోతుందనే ప్రశ్నే ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతుంది.

2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసినప్పుడు.. చైనాపై ఆధారపడిన అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రత్యామ్నాయ గమ్యస్థానాల కోసం చూడటం భారత్ గమనించింది. వెంటనే ఈ సంక్షోభాన్ని వరంగా మలచుకుంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లో ప్రొడక్టును పెంచింది. దీంతో ఫాక్స్‌కాన్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తమ యూనిట్లను తరలించే స్థాయికి చేరుకుంది. దీని వల్ల 2023 నాటికి భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతులు 20 బిలియన్లకు చేరాయి, ఐఫోన్ తయారీలో 25% వాటాను టార్గెట్‌గా పెట్టుకుంది.

ఇప్పుడు, అమెరికా సుంకాలు కూడా చైనాపై ఒత్తిడిని పెంచుతుండటంతో… 125% సుంకాలతో చైనా ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో ఖరీదైనవిగా మారనున్నాయి. దీంతో అన్ని సంస్థలు భారత్, వియాత్నాం వైపు చూస్తున్నాయి. కరోనా సమయంలో ట్రాన్స్‌ఫోర్ట్ .. వస్తు రవాణాపై ప్రభావం చూపిస్తే.. ఇప్పుడు సుంకాలు ఆర్థిక ఒత్తిడి ద్వారా అదే ఫలితాన్ని సాధిస్తున్నాయి. అయితే, కోవిడ్ సంక్షోభం ఒక అత్యవసర పరిస్థితి మాత్రమే..కానీ సుంకాలు ఒక దీర్ఘకాల వాణిజ్య విధానం. దీనివల్ల భారత్‌కు స్థిరమైన ప్రయోజనాలను అందించే అవకాశం ఉంటుంది.

టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, మెషినరీ రంగాల్లో భారత్ ఎక్స్‌పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం, చైనా, తైవాన్ నుంచి సప్లై చైన్ తెగిపోయి, భారత్‌కు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది.అంతేకాదు చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు గుర్తుకు వచ్చేలా చేస్తుంది. ట్రంప్ సుంకాల విషయంలో ఇచ్చిన 90 రోజుల విరామం.. భారత్‌కు అన్ని విధాలా సన్నద్ధమయ్యే అవకాశాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిని కూడా భారత్ సద్వినియోగం చేసుకుంటే, మనదేశం ప్రపంచ వాణిజ్యంలో కొత్త శక్తిగా అవతరిస్తుందనడంలో సందేహ పడక్కరలేదని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.