అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగానే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టనుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం.. తొలి పది నెలలు నిధుల సమీకరణ చేసింది . అది కొలిక్కి రావడంతోనే ఇప్పుడు పనుల ఉన్న ప్రారంభానికి శ్రీకారం కూడా చుట్టబోతోంది. మూడేళ్లలో ఎలా అయినా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 2028కల్ల ఆ పనులు పూర్తిచేసి.. 2029 ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ కు హైటెక్ సిటీ ఎలాగో.. అమరావతిని కూడా అలా ప్రపంచానికి తలమానికంగా నిర్మించాలని సీఎం అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.దీనిలో భాగంగానే అమరావతి స్థాయిని చాటి చెప్పడానికి ఐకానిక్ భవనాల నిర్మాణానికి నిర్ణయించారు. ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి నిర్ణయం తీసుకుని.. ఐకానిక్ టవర్లను నిర్మించేందుకు ఆమోదముద్ర వేశారు. అయితే అక్కడ 24 గంటల వ్యవధిలోనే పనులు ప్రారంభించడమే కాదు.. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి కార్యాచరణను ప్రకటించారు.
అమరావతి రాజధానిలో కీలకమైన సచివాలయం, హై కోర్ట్, ఉన్నతాధికారుల కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు సీఆర్డీఏ టెండర్లను పిలిచింది. సచివాలయానికి నాలుగు టవర్లు అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కార్యాలయాలకి ఒక టవర్ కేటాయించిన ప్రభుత్వం.. వాటికి సంబంధించిన టెండర్లను ఆహ్వానించారు. ఈ రెండు టెండర్ల షీల్డ్ బిడ్లను మే నెల 1వ తేదీన తెరవనున్నారు.
ఈ టవర్ల నిర్మాణానికి భారీగా ఖర్చు చేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. హెచ్ఓడి టవర్ నిర్మాణానికి 1126 కోట్ల రూపాయలు, సచివాలయం 1, 2 టవర్ల కోసం 1897 కోట్ల రూపాయలు, సచివాలయం 3, 4 టవర్ల నిర్మాణానికి 1664 కోట్ల రూపాయలు… మొత్తంగా ఐదు టవర్ల నిర్మాణానికి 4,668 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి బహుళ అంతస్తులు నిర్మించబోతున్నారు. ఉన్నతాధికారులు ఉండే హెచ్వోడి టవర్ ను 45 అంతస్తులతో.. సచివాలయానికి సంబంధించిన 4 టవర్లను ఒక్కొక్కటి 40 అంతస్తులతో నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి రెండున్నర ఏళ్ల గడువు విధించారు. అటు ఇటుగా మరో మూడేళ్లలో ఈ టవర్లు అందుబాటులోకి తీసుకురావడానికి సీఎం సిద్ధం అవుతున్నారు.మొత్తంగా అమరావతికి గుర్తింపుగా ఐకానిక్ టవర్లు నిలిచేవిధంగా వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.