తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమండిపోతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవగా..రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు ఏకంగా రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో ప్రజలు భయపడుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సూర్యుడు తన ప్రతాపం చూపించాడు.ఇప్పుడు మేలో నమోదవ్వాల్సిన టెంపరేచర్ ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయి.నిన్న మొన్నటి వరకు అకాల వర్షాలు కాస్త వాతావరణాన్ని చల్లబరిచినా.. మళ్లీ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండ తన ప్రతాపం చూపుస్తుంది. మధ్యాహ్నం వేళల్లో అయితే నిప్పుల కొలిమిలో ఉన్నట్లే జనాలు అల్లాడిపోతున్నారు. దీంతో తెలంగాణలో చాలా జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నేటి నుంచి నాలుగు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, కొమరం భీమ్,జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ నాలుగు రోజులు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.అలాగే 19 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఎండలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇవాళ, రేపు వేడి గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరోవైపు ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మే ఎంటరవకముందే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల జిల్లా గోనవరంలో బుధవారం రికార్డ్ స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ సీజన్‌లో ఇదే హై టెంపరేచర్ అని వాతావరణ శాఖ తెలిపింది ఏపీ వ్యాప్తంగా 135 ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.