బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై, అన్ని విధాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా, థాయ్‌లాండ్ ఈ తుఫాన్‌కి ‘మొంథా’గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.
కేంద్రం సాయం
ఈ సందర్భంగా కేంద్ర నుండి రాష్ట్రానికి అవసరమైన పూర్తి స్థాయి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను పరిస్థితిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి సమీక్ష – కీలక ఆదేశాలు:
రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) ద్వారా మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువ గట్లను పటిష్టం చేసి, పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు లోకేశ్, అనితతో పాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రస్తుత పరిస్థితి:
మొంథా తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై, 16 కి.మీ. వేగంతో తీరాన్ని సమీపిస్తోంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, తుఫాన్ రేపు (మంగళవారం) రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉంది.





































