తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయనకి పితృవియోగం కలిగింది. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున అంతిమ శ్వాస విడిచారు. ప్రస్తుతం సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్-కోకాపేట్ ప్రాంతంలో ఉన్న క్రిస్ విల్లాస్‌లో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. కుటుంబసభ్యులు ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇక తన్నీరు సత్యనారాయణ మృతి సమాచారం తెలియగానే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి గారు కూడా మాజీ మంత్రి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, తన్నీరు సత్యనారాయణ గారి ఆత్మకి శాంతి కలగాలని ఆకాంక్షించారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన బావ (7వ సోదరి లక్ష్మి భర్త) సత్యనారాయణ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
ఇంకా కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా హరీశ్ రావు కుటుంబానికి బాసటగా నిలిచారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కవిత ప్రకటించారు. వీరితోపాటుగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు హరీశ్ రావు గారిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతున్నారు.







































