గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరా: మంత్రి కేటీఆర్

Minister KTR Held A Meeting With Officials Over Greater Warangal Municipal Corporation,Daily Water Supply In GWMC Areas From Ugadi,KTR,Greater Warangal Municipal Corporation,Minister KTR,Warangal Urban,Residents Ares In GWMC Limits,GWMC Limits Will Get Daily Water Supply From Next Ugadi Festival,Ugadi,Festival,Mango News,Mango News Telugu,GWMC limits,Warangal,Minister KTR Latest News,Minister KTR News,KTR Ugadi Gift For Warangal Daily Water,Free Drinking Water In Warangal From Ugadi,Daily Water Supply In GWMC Areas From Ugadi,Free Drinking Water In Warangal,Minister KTR Held A Meeting With Officials,Minister KTR Officials Meet,Warangal Daily Water

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పైన జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి మరియు సంక్షేమ కార్యక్రమాల పైన మంత్రి కేటీఆర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.

వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకి అందించే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి కేటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఉగాది నుంచి నగర పరిధిలో తాగునీరు ప్రతిరోజు అందించేలా ముందుకుపోవాలని, ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరంగల్ నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ-అర్బన్ ద్వారా పెద్ద ఎత్తున నగరంలో తాగునీటి సరఫరాకు అవసరమైన మౌలిక వసతుల కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో కేవలం 30 ఎంఎల్డీల నీటి సరఫరా నగరానికి ఉంటే, ప్రస్తుతం 168 ఎంఎల్డీలకి పెరిగిందని, దీంతో పాటు నగరంలో గతంలో 1400 కిలోమీటర్ల పైపులైన్లు ఉంటే దీనికి అదనంగా ఇప్పటికే 1400 కిలోమీటర్లు పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిందని, దీంతో పాటు మరో 500 కిలోమీటర్ల పైప్ లైన్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయలను వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్లు, వచ్చే ఉగాది నాటికి దాదాపు ఈ పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరా బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా 2048 వరకు వరంగల్ నగర ప్రజల తాగునీటి డిమాండ్ ను తట్టుకునేలా రూపొందించడం జరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. నగరంలో నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన 200 మంది నియామకానికి సంబంధించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వారి సహాయంతో వెంటనే రిక్రూట్ చేసుకోవాలని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు తాగునీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి, అందుకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యేంతవరకు మునిసిపల్ శాఖ ఇంజనీరింగ్ ఈఎన్సి మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రతి వారం ఆయా పనుల పురోగతిని వరంగల్ వెళ్లి సమీక్షించాలని మంత్రి కేటీఆర్ వారిని ఆదేశించారు.

వరంగల్ నగరంలో సుమారు లక్షా 70 వేల గృహాలకు నల్లా కనెక్షన్స్ ఉన్నాయని మిగిలిన గృహాలకు కూడా సాధ్యమైనంత త్వరగా కలెక్షన్లు ఇచ్చేలా, నల్ల కలెక్షన్లను ఒక రూపాయికి తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, నగర ప్రజాప్రతినిధులు ఇందుకు సంబంధించిన బాధ్యత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న సుమారు 3,700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పురోగతిని కూడా మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సమీక్షించారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మెజారిటీ ఇండ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ లు మంత్రులకు తెలియజేశారు. త్వరలోనే పూర్తయిన 800 ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రులు తెలిపారు. దీంతో పాటు నగర పరిధిలో జిల్లా కలెక్టరేట్ తో పాటు మోడల్ జూనియర్ కాలేజ్ వంటి మౌలిక వసతుల నిర్మాణాలు పూర్తయ్యాయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వీటిని త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

వరంగల్ పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వైకుంఠ ధామల నిర్మాణం, అర్బన్ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలను కార్పొరేషన్ పరిధిలోని కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పార్కుల అభివృద్ధి మరియు టాయిలెట్ల నిర్మాణం వంటివి పూర్తయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతి నెల కార్పొరేషన్ కి 7.33 కోట్ల రూపాయలను ఇస్తున్నదని, ఇప్పటిదాకా సుమారు 81 కోట్ల రూపాయలను ప్రభుత్వం పట్టణ ప్రగతి నిధుల ద్వారా అందించిందని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఇప్పటిదాకా 440 కి పైగా పనులు పూర్తి కావడం లేదా పురోగతిలో ఉన్న విషయాన్ని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ నగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమాలతో పాటు చారిత్రక కట్టడాల పరిరక్షణ మరియు నగర పారిశుధ్యం, నగర రోడ్డు నెట్వర్క్ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు సలహాలు సూచనలను పురపాలక శాఖ ఉన్నతాధికారులకు అందించారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు సత్యవతి రాథోడ్ లు వరంగల్ కార్పొరేషన్ కి ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నగరాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం మార్గదర్శనంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరం వేగంగా తన రూపు రేఖలు మార్చుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని నగర కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేలా ప్రజాప్రతినిధులు అంతా కలిసి సమన్వయంతో ముందుకు పోతా మన్నారు.

కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా గిరిజన ప్రజలున్నారని, పేదరికంలో ఉన్న వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లెందుకు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్, టెక్స్ టైల్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి కేటిఆర్ ను కోరింది. జిల్లాలో దాదాపు 800 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ యూనిట్లు నెలకొల్పేందుకు గుర్తించామని చెప్పారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో పుర‌పాల‌క‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్, ఆర్థిక‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రామ‌కృష్ణారావు, జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ప‌బ్లిక్ హెల్త్ ఇఎన్సి శ్రీ‌ధ‌ర్, సిఇ ధ‌న్ సింగ్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 5 =