ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్న మొంథా తుఫాను నిన్న రాత్రి నర్సాపూర్ వద్ద తీరం దాటింది. దీని తీవ్రత ధాటికి ఏపీలో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇదిలావుంటే, మరోవైపు దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లగొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారమైన వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేడు మరియు రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావం కారణంగా పలు చోట్ల గాలివానలు, వడగండ్ల వానలు, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ప్రభుత్వం అధికారులు, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్లడం మానుకోవాలని సూచనలు జారీ చేశారు.
నగరాల్లో రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. మొంథా తుఫాన్ బలహీనపడినప్పటికీ, దాని ప్రభావం వల్ల వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అయితే, IMD అంచనాల ప్రకారం, తుఫాను వ్యవస్థ మరింత బలహీనపడి ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే వరకు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.




































