తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ అభివృద్ధికి మరియు కార్మికుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. సినిమా టికెట్ల ధరలు పెంపు మరియు ఇతర అభ్యర్ధనలకు అంగీకరిస్తూనే, అందుకు కొన్ని షరతులు విధించారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు:
- టికెట్ల ధరల పెంపు షరతు: సినిమా టికెట్ల ధరలు పెంచినట్లయితే, ఆ అదనపు ఆదాయం నుంచి 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి షరతు విధించారు.
- సంక్షేమ నిధి: సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం రూ. 10 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
- పరిశ్రమకు గుర్తింపు: ఐటీ, ఫార్మా తరహాలోనే సినీ పరిశ్రమను ఒక ముఖ్యమైన రంగంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తున్నట్లు తెలిపారు.
- విద్య, వైద్యం: కార్మికులందరికీ ఆరోగ్య బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించారు. కృష్ణానగర్‌లో మూడు-నాలుగు ఎకరాల్లో కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ తరహా పాఠశాల నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
- హాలీవుడ్ లక్ష్యం: సినీ కార్మికుల సహకారం ఉంటే రామోజీ ఫిల్మ్ సిటీకి హాలీవుడ్‌ను రప్పిద్దాం అని, హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా మారుద్దామని అన్నారు.






































