అన్నదాతకు అపార నష్టం – సాయానికి సిద్దమైన ఏపీ ప్రభుత్వం

AP CM Chandrababu Seeks Immediate Report on Crop Damage After Cyclone Montha

మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వలన ప్రాణనష్టం లేనప్పటికీ వ్యవసాయ రంగానికి మాత్రం కోలుకోలేని దెబ్బే పడింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో, కష్టపడి పండించిన చేతికి అందివచ్చిన పంట పాడైపోయిందని అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు:

ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నష్టం అంచనా పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. తాజాగా, సీఎం చంద్రబాబు గారు తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన కోనసీమ జిల్లాలో పర్యటించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ధైర్యం చెప్పి, తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పంట నష్టం అంచనాలపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పొలాలను సందర్శించి నష్టం అంచనా వేసి తుది నివేదికను రూపొందించే పనిలో పడ్డారు.

ఇక తుఫాను బారిన పడిన 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో దాదాపు 18 లక్షల మంది ప్రజలపై మొంథా ప్రభావం పడినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దురదృష్టవశాత్తు, రాష్ట్రంలో తుఫాను సంబంధిత ఘటనల వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు అని అధికారులు వెల్లడించారు.

పశ్చిమ గోదావరిలో వేల హెక్టార్లలో పంట నష్టం:

మొంథా తుఫాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను తీవ్రంగా దెబ్బతీసింది. ఇక్కడ పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, జిల్లాలో ఏకంగా 10 వేల హెక్టార్లలో వరిపంట నేలకొరిగింది. అంతేకాకుండా, సుమారు 5 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.

అలాగే, ఆక్వా రంగానికి సైతం మొంథా నష్టం కలిగించింది; రెండు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు పూర్తిగా నీట మునిగినట్లు అధికారులు ధృవీకరించారు. తుది నష్టం అంచనాలు రాగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగిన సహాయం అందించాలని కోరనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here