మహిళల ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో భారత మహిళా జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. గురువారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన రెండో సెమీ-ఫైనల్లో, తిరుగులేని ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి, టీమిండియా సగర్వంగా ఫైనల్‌కు చేరుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు కావడం విశేషం.
𝙏𝙚𝙖𝙧𝙨 𝙊𝙛 𝙅𝙤𝙮 💙
Absolute scenes from Navi Mumbai 🇮🇳#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues | @mandhana_smriti | @ImHarmanpreet pic.twitter.com/Mw6DahFmz2
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
చారిత్రక విజయం:
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119), ఎలీస్ పెర్రీ (77), యాష్లీ గార్డ్నర్ (63) మెరుపు ఇన్నింగ్స్‌ల సహాయంతో నిర్ణీత 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీ చరణి మరియు దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. జెమీమా అద్భుత శతకం!
339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ల నుంచి ఆశించిన శుభారంభం దక్కలేదు. అయితే, ఈ టోర్నమెంట్లో నిలకడగా రాణిస్తున్న యువ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్; 134 బంతుల్లో 14 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) నుంచి బలమైన మద్దతు లభించింది.
ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 167 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. కీపర్ రిచా ఘోష్ (26) మరియు దీప్తి శర్మ (24) చివర్లో వేగంగా ఆడటంతో, భారత్ 48.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ తన అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది.
మొత్తానికి ఈ చారిత్రక విజయంతో టీమిండియా, 15 వన్డేల నుంచి ఆస్ట్రేలియా సాధిస్తున్న వరుస విజయాలకు బ్రేక్ వేసింది. కాగా, మహిళల వన్డేల్లో 300 పైగా స్కోరును చేధించడం ఇది మూడోసారి మాత్రమే కావడం విశేషం. ఇదే టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఆసీస్ అధిగమించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు భారత్ అదే ఆసీస్‌పై 339 పరుగుల టార్గెట్‌ను ఛేదించి టాప్‌లో నిలిచింది. ఇక గతేడాది సౌతాఫ్రికాపై లంక 302 స్కోరు చేసి గెలిచింది. భారత్ నవంబర్ 2న జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు మూడోసారి దక్కడం విశేషం.
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా:
బ్యాటింగ్: హీలీ (బి) క్రాంతి 5, లిచ్‌ఫీల్డ్ (బి) అమన్‌జోత్ 119, పెర్రీ (బి) రాధ 77, బెత్ మూనీ (సి) జెమీమా (బి) చరణి 24, సదర్లాండ్ (సి అండ్ బి) చరణి 3, గార్డ్నర్ (రనౌట్/క్రాంతి) 63, మెక్‌గ్రాత్ (రనౌట్/జెమీమా) 12, కిమ్ గార్త్ (రనౌట్/అమన్‌జోత్) 17, కింగ్ (సి) రిచా (బి) దీప్తి 4, మోలినెక్స్ (బి) దీప్తి 0, మేగన్ షుట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 49.5 ఓవర్లలో 338 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-25, 2-180, 3-220, 4-228, 5-243, 6-265, 7-331, 8-336, 9-336; బౌలింగ్: రేణుక 8-0-39-0, క్రాంతి గౌడ్ 6-0-58-1, శ్రీచరణి 10-0-49-2, దీప్తి శర్మ 9.5-0-73-2, అమన్‌జోత్ 8-0-51-1, రాధ 8-0-66-1.
భారత్:
బ్యాటింగ్: షఫాలీ (ఎల్బీ) గార్త్ 10, మంధాన (సి) హీలీ (బి) గార్త్ 24, జెమీమా (నాటౌట్) 127, హర్మన్ (సి) గార్డ్నర్ (బి) సదర్లాండ్ 89, దీప్తి (రనౌట్/గార్త్) 24, రిచా (సి) గార్త్ (బి) సదర్లాండ్ 26, అమన్‌జోత్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 48.3 ఓవర్లలో 341/5.
వికెట్ల పతనం: 1-13, 2-59, 3-226, 4-264, 5-310; బౌలింగ్: మేగన్ షుట్ 6-0-40-0, కిమ్ గార్త్ 7-0-46-2, గార్డ్నర్ 8-0-55-0, మోలినెక్స్ 6.3-0-44-0, సదర్లాండ్ 10-0-69-2, అలనా కింగ్ 9-0-58-0, తహిల 2-0-19-0.
 
			 
		





































