భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును తన నివాసమైన లోక్ కల్యాణ్ మార్గ్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు. టోర్నమెంట్ ప్రారంభంలో ఎదురైన మూడు వరుస ఓటముల కారణంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదురైనా, అక్కడి నుంచి అద్భుతంగా పుంజుకుని ట్రోఫీని గెలుచుకున్న జట్టు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చేయిపై ఉన్న హనుమాన్ టాటూ, ఆమె ‘జై శ్రీరామ్’ పోస్ట్ వంటి వ్యక్తిగత అంశాలను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ భేటీ సందర్భంగా, జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, 2017లో ట్రోఫీ లేకుండా ప్రధానిని కలిశామని గుర్తుచేసుకున్నారు. “ఇప్పుడు ట్రోఫీతో కలిశాం, ఇకపై తరచుగా కలవాలని కోరుకుంటున్నాం” అని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వైస్-కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ, ప్రధాని మోదీ తమందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ప్రోత్సాహం వల్లే నేడు దేశవ్యాప్తంగా బాలికలు వివిధ రంగాలలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, ప్రధాని మోదీ, హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్‌ల అద్భుతమైన క్యాచ్‌లను గుర్తుచేసుకున్నారు. మీరు పట్టింది క్యాచ్ కాదని, ట్రోఫీ అని పేర్కొన్నారు.
చివరగా, ప్రధానమంత్రి జట్టు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు దేశవ్యాప్తంగా ఉన్న యువతులు, బాలికల మధ్య ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని బలంగా తీసుకువెళ్లాలని, ఆరోగ్యంగా ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలని సూచించారు.





































