తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరుతూ, భారత రాష్ట్ర సమితి (BRS) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ నాయకులు సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.
అభివృద్ధి-అవినీతి ఆరోపణలు:
కేటీఆర్ విమర్శలను తిప్పికొడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు సహా పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధిపై కేటీఆర్ చేసిన సవాల్‌కు, తమ ఎమ్మెల్యే శ్రీగణేశ్ రూ. 5 వేల కోట్ల పనుల జీవోలు చూపించారని, దీనికి కేటీఆర్ బదులివ్వాలని డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రక్త నమూనాలు ఇవ్వడానికి కేటీఆర్ పారిపోయారని ఆరోపించారు.
అవినీతిపై మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్‌ల అవకతవకలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై తాను మాట్లాడితే, ఆరు గ్యారంటీలపై చర్చకు రావాలని కిషన్‌రెడ్డి కోరడం సరికాదన్నారు. కిషన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్‌షాలతో చర్చించి తండ్రీకొడుకులను జైల్లో పెట్టించాలని హితవు పలికారు. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీ నది అభివృద్ధి చెందకుండా, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లకు నిధులు రాకుండా కిషన్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.
మైనార్టీలు, సినీ కార్మికుల సంక్షేమంపై..
మైనార్టీలను అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని, కానీ కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పదేళ్లు మోసం చేశారని విమర్శించారు. క్రీడాకారులు మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వడం, అలాగే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం తమ మైనార్టీల గౌరవానికి నిదర్శనమన్నారు.
ముస్లింలు, హిందువులు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ల వంటివారని తెలిపారు. కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సంక్షేమం కోసం గద్దర్ పేరుతో అవార్డులు అందజేయడంతో పాటు, కార్పొరేట్ తరహాలో పాఠశాల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. షేక్‌పేట డివిజన్లో 15 వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి మోదీ, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి ఓటర్లను కోరారు.
యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నాను. నాటి పాలకులు సినీ ప్రముఖులతో సావాసం చేస్తే … నేను సినీ కార్మికుల సంక్షేమం ఆలోచిస్తున్నాను. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను సంక్షేమ రాజ్యంతో నెరవేర్చుతున్నాం. పదేళ్లు బీజేపీ – బీఆర్ఎస్ కలిసి చేయలేని అభివృద్ధి నేడు ప్రజా… pic.twitter.com/pTTxBYiV1H
— Revanth Reddy (@revanth_anumula) November 5, 2025

































