క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా ప్రకటించిన చంద్రబాబు సర్కార్

CM Chandrababu Naidu Felicitate World Cup Star Shree Charani

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 విజేత భారత జట్టు సభ్యురాలు శ్రీచరణి శుక్రవారం (నవంబర్ 7, 2025) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె వెంట భారత మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. ఈ మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఇరువురికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా, ప్రపంచ కప్‌ గెలుచుకున్నందుకు ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్.. శ్రీచరణిని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని, ప్రపంచకప్ గెలుపు ద్వారా భారత మహిళలు తమ సత్తా చాటారని కొనియాడారు. అనంతరం, వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పంచుకున్నారు.

ఇక మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా శ్రీ చరణిని ప్రశంసిస్తూ.. ఆమె అచంచల అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆమె అద్భుతమైన విజయాన్ని గ్రూప్-1 ప్రభుత్వ పదవి, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

శ్రీచరణి ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా, ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు సహా పలువురు ఎంపీలు, మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలికి, శ్రీచరణి, మిథాలీ రాజ్‌ను వెంటబెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయాన్నికి వచ్చారు.

అయితే, ముఖ్యమంత్రితో భేటీ నేపథ్యంలో, గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ముందుగా తలపెట్టిన భారీ విజయోత్సవ ర్యాలీని ఏసీఏ రద్దు చేసింది. సీఎంను కలిసిన తర్వాత శ్రీచరణి మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించేందుకు బయలుదేరి వెళ్లారు.

అలాగే, శ్రీచరణి నేడు సాయంత్రం తన సొంత జిల్లా కడపకు పయనం కానున్నారు. అక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆమెను ఘనంగా సత్కరించనుంది. అనంతరం కడప నగరంలో శ్రీచరణితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here