భారత్‌ రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలక ఒప్పందంపై ప్రధాని మోదీతో చర్చలు

Russia President Putin's India Tour: Likely To Sign Labour Mobility Agreement After Talks With PM Modi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ డిసెంబర్‌లో భారతదేశ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన భారత్‌ రానున్నారు. ఈ సందర్శనను రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచే కీలక దశగా భావిస్తున్నారు. పుతిన్‌ పర్యటనకు సంబంధించి క్రెమ్లిన్‌ ముమ్మర ఏర్పాట్లు ప్రారంభించింది. వ్లాదిమిర్ పుతిన్‌ ఈ పర్యటనతో భారత్-రష్యా మధ్య ఉన్న పాత మైత్రి సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పర్యటన వివరాలు..

కాగా, 2021 తర్వాత అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ద్వైపాక్షిక సంబంధాల పరంగా గత ఏడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకు వెళ్లి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగా, అక్టోబర్‌లో బ్రిక్స్ (BRICS) సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్‌లో ఇరువురు నేతలు మరోసారి సమావేశమయ్యారు.

కార్మికుల మార్పిడి ఒప్పందం..

అయితే ఉక్రెయిన్‌తో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో భవన నిర్మాణం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణులు, కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో రష్యా కార్మిక శాఖ దీనిని పూరించేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో అది నిర్దేశించే కోటాల ప్రకారం ఆయా పరిశ్రమల్లో భారతీయులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించబోతున్నాయి.

దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య డిసెంబర్‌లో కీలక ఒప్పందం కుదరనుంది. ఈ నేపథ్యంలో 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.

అలాగే, ఈ పర్యటనలో భాగంగా పుతిన్‌ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా భారత్-రష్యా సంబంధాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో ఈ పర్యటనపై రెండు దేశాల దృష్టి కేంద్రీకృతమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here