హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షం భారాసపై కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతను కనబరచి, ప్రతిష్ఠాత్మక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంపై కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, భారత రాష్ట్ర సమితి (భారాస) అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 24,658 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అతి తక్కువ పోలింగ్ నమోదైనప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి తొలి రౌండ్‌ల నుంచి స్థిరంగా ఆధిక్యాన్ని కొనసాగించి, చివరికి స్పష్టమైన మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.
ఇక విజయం ఖరారు కావడంతో యూసుఫ్‌గూడలోని కౌంటింగ్ కేంద్రం వద్ద, అలాగే గాంధీభవన్ వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద కార్యకర్తలు, నాయకులు మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ విజయం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని ఇవ్వడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయ పరిణామాలకు కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.









































