రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా ముందుకు సాగాలని భారత రాష్ట్ర సమితి (భారాస) అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 25 వేల ఓట్ల ఆధిక్యంతో భారాస అభ్యర్థి మాగంటి సునీతపై గెలిచిన నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో తమ పార్టీయే ఏకైక రాజకీయ ప్రత్యామ్నాయమని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమిద్దామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో తాము నిజాయతీగా, హుందాగా పోరాటం చేశామని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు. ఈ ఫలితం భారాసకు ఒక చిన్న ‘సెట్ బ్యాక్’ మాత్రమేనని పేర్కొన్న ఆయన, దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. అయితే, ఎన్నికల్లో ప్రలోభాలు, దొంగ ఓట్ల అంశాలపై ఎన్నికల కమిషన్, పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకు కొత్త అయినా సునీత గట్టిగా నిలబడ్డారని కొనియాడారు. బీఆర్ఎస్ గెలుస్తుందని పలు సర్వేలు చెప్పాయని గుర్తుచేశారు. ఆఖరి మూడు రోజులు ఏం జరిగిందో అందరికీ తెలుసునని విమర్శించారు. అంతేకాక, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో మరో పది చోట్ల ఉప ఎన్నికలు రావాల్సిందేనని కేటీఆర్ పేర్కొన్నారు.








































