మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి రేపు (గురువారం, నవంబర్ 20) హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. గత ఆరేళ్లుగా ఈ కేసుల విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై కోర్టులో రోజువారీ విచారణ జరుగుతోంది.
కాగా, జగన్ మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు 2020, జనవరి 10న చివరిసారిగా కోర్టుకు హాజరయ్యారు. ఆ తరువాత తాను సీఎం పదవిలో ఉన్నందున ప్రజాపాలనలో బిజీగా ఉండాల్సి వస్తుందని, బాధ్యతలు మరియు భద్రతా కారణాల రీత్యా న్యాయస్థానానికి రాలేనని తెలుపగా, కోర్టు ఆయనకు వ్యక్తిగత హాజరు నుండి మినహానింపునిచ్చింది.
అయితే, ఇటీవల జగన్ లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు కోర్టుకు సమర్పించిన ఫోన్ నంబరు తప్పుగా ఇవ్వడంతో, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ భౌతికంగా హాజరుకావడం తప్పనిసరని సీబీఐ వాదించగా, ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనకు గతంలో మంజూరు చేసిన మినహాయింపును రద్దు చేసింది.
అంతేకాకుండా, నవంబర్ 21లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు తాజాగా వైఎస్ జగన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, న్యాయస్థానం విధించిన గడువుకు ఒకరోజు ముందే, అంటే గురువారం నాడే ఆయన కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ హాజరు నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.







































