మరోసారి ప్రేక్షకుల ముందుకు ‘అమృతం’

Amrutham is Back The Super Hit Telugu Serial Returns With Remastered Audio and Video

‘ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు’.. ఈ పాట వింటే చాలు, నవ్వుల అమృతం తాగిన అనుభూతి తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొస్తుంది. 90ల నాటి పిల్లలకు (90s కిడ్స్) మరియు అంతకుముందు తరం వారికీ ప్రతి ఆదివారం రాత్రి కుటుంబ సమేతంగా కడుపుబ్బా నవ్వించిన ఆ అద్భుతమైన కామెడీ మాస్టర్‌పీస్ ‘అమృతం’ సీరియల్ తిరిగి ప్రసారం అవుతోంది.

అప్పట్లో టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సీరియల్‌ కోసం యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూసేవారు. ఇప్పుడు, ఆ నాటి అనుభవాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు, ఈ సీరియల్‌ను రిమాస్టర్డ్ ఆడియో మరియు వీడియో నాణ్యతతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈ శుభవార్తను ఆ ‘అమృతం’ టీం యూట్యూబ్ వేదికగా పంచుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన ‘అమృతం సీరియల్’ ఛానెల్‌లో నవంబర్ 24 నుంచి ఈ నవ్వుల పండగ అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజు రెండు ఎపిసోడ్‌ల చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5గంటలకు ఈ ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.

కాగా, ఈ సీరియల్‌లో టైటిల్ పాత్ర అమృతరావు’గా మొదట్లో శివాజీ రాజా, ఆ తర్వాత నరేశ్‌, కొన్నాళ్లకు నటుడు హర్షవర్ధన్‌ వంటి ప్రముఖ నటులు నటించడం విశేషం. అలాగే ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతురావు, రాగిణి, శివన్నారాయణ, వాసు ఇంటూరి, ఝాన్సీల సహాయ పాత్రలు ఈ సీరియల్‌ను చిరస్మరణీయంగా మార్చాయి. ఇంకా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోదరుడు, రచయిత కాంచీ రచన అందించడంతో పాటు నటించడం గమనార్హం. దీనికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించగా.. గుణ్ణం గంగరాజు నిర్మించారు.

‘అమృతం’ తిరిగి రావడం అనేది కేవలం ఒక సీరియల్ పునఃప్రసారం మాత్రమే కాదు, అది తెలుగు ప్రేక్షకులు తమ బాల్యం లేదా గతంలోని మధుర స్మృతులను మరోసారి నెమరువేసుకునే అవకాశం. కాలంతో పాటు మారిన సాంకేతికతకు అనుగుణంగా, అత్యుత్తమ నాణ్యతతో మళ్లీ రాబోతున్న ఈ సీరియల్, పాత తరాన్ని అలరించడంతో పాటు, కొత్త తరానికి కూడా క్లాసిక్ కామెడీని పరిచయం చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here