రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా రాష్ట్ర విద్యుత్ శాఖ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్తు ప్రణాళికలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో కీలకమైన విద్యుత్ ప్రాజెక్టుల పురోగతి మరియు ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల సీఎండీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
-
క్లీన్ ఎనర్జీ పాలసీ అమలు: రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ‘ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ’ కింద 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-
అనుమతులు త్వరగా ఇవ్వాలి: క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే వాటిని త్వరగా పరిష్కరించి, ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
-
పీఎం కుసుమ్, రూఫ్‌టాప్ ప్రాజెక్టులు: పీఎం కుసుమ్ మరియు రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని సూచించారు.
-
నాణ్యమైన విద్యుత్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి. ఉత్పత్తికి లోటు లేకుండా ఉండేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
- ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలి.
పరిశ్రమలకు ఊతం
-
ఫెర్రో అల్లాయీస్ ప్రోత్సాహకాలు: ముఖ్యమంత్రి ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలను కీలకమైన పరిశ్రమలుగా గుర్తించి, వాటికి ఇస్తున్న ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
-
ప్రభుత్వంపై భారం: ఈ ప్రోత్సాహకాల పొడిగింపు వల్ల ప్రభుత్వంపై సుమారు ₹1,053 కోట్ల ఆర్థిక భారం పడనుంది.
పీఎస్పీలపై అధ్యయనం
-
పీఎస్పీలు: రాష్ట్రంలోని రిజర్వాయర్లు మరియు ఇతర ప్రాజెక్టుల వద్ద పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీని ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.






































