‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
కాగా, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన హిట్ చిత్రం ‘అఖండ’కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంతకుముందు బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ (సింహా, లెజెండ్, అఖండ) బ్లాక్‌బస్టర్‌లుగా నిలవడంతో, ఈ సినిమా కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
దీంతో డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులే కాకుండా సినీప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో తమ అభిమాన హీరో చిత్రాన్ని థియేటర్లలో చూడబోతున్నందుకు నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో నిన్నటి వరకు నెలకొన్న నిరాశ తొలగిపోయి, పూర్తి సంతోషం వెల్లివిరిసింది. వారి ఎదురుచూపులకు తెరదించుతూ, ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ‘తాండవం’ చేయడానికి సిద్ధమైంది.




































