భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. జోర్డాన్, ఇథియోపియా మరియు ఒమన్ దేశాలను ఆయన సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్య దేశమైన ఒమన్‌తో భద్రతా, ఆర్థికపరమైన సంబంధాలపై దృష్టి పెట్టనున్నారు.
ఈ పర్యటనలో మొదటి అంచెగా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 15, 16 తేదీల్లో మోదీ జోర్డాన్‌లో పర్యటిస్తారు. అక్కడ రాజుతో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతో పాటు, గాజా ప్రాంతంలోని పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
రెండో అంచెగా, మోదీ తొలిసారిగా డిసెంబర్ 16, 17 తేదీల్లో ఆఫ్రికా దేశమైన ఇథియోపియాను సందర్శిస్తారు. అక్కడ ప్రధానమంత్రి డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక సంబంధాల గురించి విస్తృత చర్చలు జరపనున్నారు. ఇరు దేశాలు ‘గ్లోబల్ సౌత్’లో భాగస్వాములుగా ఉండగా, ఈ పర్యటనలో మోదీ ఇథియోపియా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇక చివరిదైన మూడవ అంచెలో, ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 17, 18 తేదీల్లో ప్రధాని ఒమన్‌లో పర్యటిస్తారు. ఇది మోదీ ఒమన్‌లో పర్యటించడం రెండోసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఇంధనం వంటి రంగాలతో సహా అన్ని స్థాయిల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించనున్నారు.
అయితే, ఈ సందర్భంగా భారత్-ఒమన్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఒమన్ వైమానిక దళం ఉపసంహరించుకున్న జాగ్వార్ యుద్ధ విమానాల విడిభాగాలను భారత్ కోరుకునే అవకాశం ఉంది.
Over the next three days, will be going to Jordan, Ethiopia and Oman. These are three valued partners with whom India has age-old civilisational ties and strong bilateral relations.https://t.co/QSkwR9m6IZ
— Narendra Modi (@narendramodi) December 15, 2025


































