ప్రముఖ కపుల్ వ్లాగర్స్ హర్షిణి మరియు హరి తమ యూట్యూబ్ ఛానల్‌లో మహాభారతంలోని ద్రౌపది వివాహ ఘట్టం వెనుక ఉన్న నిగూఢ ధర్మాన్ని వివరిస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం చేసుకోవడం అధర్మమని భావించే వారికి, దీని వెనుక ఉన్న ‘దైవ నిర్ణయం’ మరియు ‘వ్యాస నిర్ణయం’ గురించి హర్షిణి కూలంకషంగా వివరించారు.
ద్రౌపది పూర్వజన్మలో శివుడిని ప్రార్థించి, పొరపాటున ఐదు సార్లు ‘పతి కావాలి’ అని అడగడం వల్ల ఈ జన్మలో ఐదుగురు భర్తలు లభించారని వీడియోలో పేర్కొన్నారు. అలాగే, పాండవులు ఐదుగురు వేర్వేరు దేవతల అంశలే అయినప్పటికీ, అందరూ ఇంద్రుడి తేజస్సుతో కూడినవారేనని వ్యాస మహర్షి దృపదుడికి దివ్యదృష్టిని ప్రసాదించి నిరూపించారని వివరించారు. ఇది లోక కళ్యాణం కోసం జరిగిన దివ్య వివాహమని, ఇందులో ఎలాంటి అధర్మం లేదని పురాణ ఆధారాలతో సహా స్పష్టం చేశారు.





































