కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. లోక్ సభలో 16 మంది ఎంపీల బలం ఉన్న తెలుగు దేశం పార్టీ బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది. అటు ప్రధాని మోడీ కూడా అన్ని విషయాల్లో తెలుగు దేశం పార్టీకి సరైన ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు దేశం కూటమితో కలిసి ఏపీలో బీజేపీ వైసీపీని ఓడించింది. కానీ ఇప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి వచ్చింది. రాజ్యసభలో బీజేపీకి వైసీపీ కీలకంగా మారింది.
నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాటు ఎదురులేకుండా ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగారు. అక్కడి ప్రజలతో ఎనలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నవీన్ పట్నాయక్ ఎంతగానో కృషి చేశారు. అందుకే ఇన్నాళ్ల పాటు ఒడిశా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. కానీ ఆయన తొలిసారి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో బిజు జనతా దళ్ పార్టీ ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇన్నాళ్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఒడిశాలో అధికారంలో ఉన్నప్పటికీ.. కేంద్రంలోని బీజేపీకి సహకరిస్తూనే వచ్చింది. కానీ ఈసారి అదే బీజేపీ ఆయన్ను ఓడించింది.
అందుకే బీజేపీతో పోరాడేందుకు నవీన్ పట్నాయక్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం లోక్ సభలో బిజు జనతా దళ్ పార్టీకి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వారంతా కేంద్రంలో అధికారంలో ఎన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని వారికి సూచించారు. అయితే ఇన్నాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో అన్ని విధాలుగా బీజేపీకి నవీన్ పట్నాయక్ సహకరిస్తూ వచ్చారు. అత్యంత కీలకమైన బిల్లులు పాస్ అవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఆయనే బీజేపీపై యుద్ధం చేస్తున్నారు.
దీంతో రాజ్యసభలో 11 మంది ఎంపీల బలమున్న వైసీపీ.. బీజేపీకి పెద్ద దిక్కు అయింది. 2026 వరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీలు కొనసాగుతారు. దీంతో అప్పటి వరకు రాజ్యసభలో వైసీపీ హవా కొనసాగనుంది. అయితే తనను ఓడించిన బీజేపీకి జగన్ మద్ధతు ఇస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ ఇటీవల జరిగిన స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి అనుకూలంగా వైసీపీ ఎంపీలు ఓటు వేశారు. దీంతో రాజ్యసభలోనూ బీజేపీకి అనుకూలంగా వైసీపీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE